Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇళ్ల కోసం కొత్త ప్లాన్లు, రివ్యూలో మంత్రి పొంగులేటి ఆదేశాలు
Ponguleti Srinivas Reddy: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు (డిసెంబర్ 12) గృహ నిర్మాణశాఖ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
Minister Ponguleti Srinivas Reddy: తెలంగాణ కొత్తగా నిర్మించబోయే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మూడు లేదా నాలుగు నమూనాలతో ప్లాన్లు సిద్ధం చేయాల్సిందిగా తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థను పునరుద్ధరణ చేస్తూ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడానికి ఇంకా అవసరమైన సిబ్బందిని ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై కూడా తీసుకోనే విధంగా ప్రతిపాదనలు సిద్దం చేయవలసిందిగా సంబంధిత సెక్రటరీని మంత్రి పొంగులేటి ఆదేశించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు (డిసెంబర్ 12) గృహ నిర్మాణశాఖ కార్యకలాపాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గృహ నిర్మాణశాఖ సెక్రటరీ శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ, గృహ నిర్మాణ సంస్థ ఎండీ విజయేంద్ర బోయి, గృహ నిర్మాణ సంస్థ, గృహ నిర్మాణ మండలి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. త్వరలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించి పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి విధివిధానాలు ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమానికి అవసరం అయిన నిధుల సమీకరణ కోసం అవసరం అయిన చర్యలు తీసుకోవాలని, అందుకు తగినట్లుగా ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. టెండర్లు ఖరారు చేసి నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేయుటకు అవసరం అయిన నిధుల వివరాలు సమర్పించాలని ఆదేశించారు.
రాజీవ్ స్వగృహ ద్వారా అభివృద్ధి చేయబడిన ఆస్తుల గురించి మంత్రి ఆరా తీశారు. విక్రయించబడని ఆస్తులను తగిన ధరలతో మార్కెట్ చేయడానికి, విక్రయించడానికి వృత్తిపరమైన (expert) బృందాలను నియమించాలని ఆదేశించారు. సెమీ ఫినిష్డ్ టౌన్ షిప్‌లను సరైన ధరలకు కేబినెట్‌లో చర్చించి విక్రయించేందుకు తగిన నిర్ణయం తీసుకోనున్నారు. గృహ నిర్మాణ మండలి ఆస్తుల సమగ్ర వివరాలు సిద్దం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.