KTR Letter: కడుపులో ద్వేషంతో కపట యాత్రలు చేస్తే ఎలా? మీవి సిగ్గూ ఎగ్గూ లేని యాత్రలు: కేటీఆర్
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తూ బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ చేస్తున్నది ప్రజా వంచన యాత్ర అని అభివర్ణించారు.
KTR Letter to Bandi Sanjay: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) రెండో విడతగా చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై తీవ్రంగా స్పందిస్తూ మంత్రి కేటీఆర్ (Minister KTR) బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ చేస్తున్నది ప్రజా వంచన యాత్ర అని అభివర్ణించారు. ఓ జుటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న ధగాకోరు యాత్ర అంటూ లేఖలో పేర్కొన్నారు.
‘‘పచ్చ బడుతున్న పాలమూరుపై కచ్చ కట్టిన మీకు అక్కడ అడుగుపెట్టే హక్కులేదు. కృష్ణా జిలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జల దోపిడీకి జై కొడుతూ.. పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్న మీరు సిగ్గూ ఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా? పాలమూరుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులపై బోర్డులు పెట్టి బోడిపెత్తనం చేస్తూ పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా? పాలమూరు ఎత్తిపోతల పథకానికి (Palamuru Lift Irrigation Scheme) జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు? కర్ణాటక మీద కనికరం చూపిన మీరు పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నారో సమాధానం చెప్పాలి? అడుగడుగునా అన్యాయం తెలంగాణ పుట్టకముందే కత్తిగట్టిన పార్టీ బీజేపీ’’ అంటూ మంత్రి కేటీఆర్ బండి సంజయ్‌ను ఉద్దేశించి విమర్శించారు.
‘‘విభజన హామీలు నెరవేర్చే తెలివి లేదు, నీతి ఆయోగ్ (Niti Ayog) చెప్పినా నిధులిచ్చే నీతి లేదు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు. ఉచిత కరెంట్ ఇస్తుంటే మోటర్లకు మీటర్లు పెట్టమని బ్లాక్ మెయిల్ చేస్తారు. పండించిన పంటలు కొనకుండా రైతులను గోస పెడుతుంటారు. సందు దొరికితే చాలు తెలంగాణ మీద విషం కక్కుతారు. తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ బీజేపీ. కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభం? వరి పంటతో రాజకీయ చలి మంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా?
రైతులతో రాబందుల్లా వికృత రాజకీయం చేసి వడ్లను కొనమని అడిగితే చేతకాదని చేతులెత్తేసిన మీరు ఇప్పుడు మిడతల దండులా యాత్రకు బయల్దేరతారా? రైతు ద్రోహి, రాష్ట్ర ద్రోహి పాత్ర పోషిస్తున్న మీకు పాదయాత్ర చేసే నైతిక హక్కు అస్సలు లేనేలేదు. తన పాదయాత్రకు రైతు ద్రోహ యాత్ర అనో లేక రైతు ధోకా యాత్ర అనో పేరు పెట్టుకుంటే మంచిది. పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అంటూ మంత్రి కేటీఆర్ (KTR) తన లేఖలో పేర్కొన్నారు.