Minister KTR: మెట్రో రైలు కోసం మంత్రి కేటీఆర్‌కు వినతులు - ప్రజల నుంచి మాత్రం కాదు
Minister KTR: తమ ప్రాంతాలకు కూడా మెట్రో కావాలంటూ మంత్రి కేటీఆర్ కు పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. అయితే ఇవి ప్రజల నుంచి కాదు.. ప్రజాప్రతినిధుల నుంచి.
Minister KTR: భాగ్య నగర వాసుల బాధల్ని తీరుస్తూ, లక్షల మందికి ఊరట ఇస్తోంది మెట్రో రైలు వ్యవస్థ. ఫేజ్ ల వారీగా మరింత దూరం పట్టాలపై పరుగులు పెట్టేందుకు సిద్ధమైపోతుంది. అయితే ఈ సర్వీసులను తమ ప్రాంతంలోనూ ఏర్పాటు చేయాలంటూ పలవువు ప్రజాప్రతినిధులు మంత్రి కేటీఆర్ వద్దకు వస్తున్నారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కు మెట్రో సర్వీస్ పొడగింపుపై విజ్ఞప్తులు చేశారు. ఎల్బీనగర్-రామోజీ ఫిలింసిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజల్, ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫీర్జాదిగూడ, మియాపూర్-పటాన్ చెరు మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు నిర్మించాలని కోరారు.
ఈ ప్రాజెక్టుల విషయంలో డీపీఆర్ తయారు చేయాలంటూ అధికారులను ఆదేశించాలని మంత్రి కేటీఆర్ కు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కోరారు. అలాగే మెట్రో పొడగింపుతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకం, వాణిజ్యం ఊపందుకుంటాయని వారు పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలకు ముగింపు పడుతుందని చెప్పారు. ఈ విజ్ఞప్తులను పరిశీలిస్తామని ఆయన వాళ్లకు చెప్పినట్లు సమాచారం.
రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో
హైదరాబాద్‌లోని రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలో మీటర్ల మార్గంలో తొమ్మిది మెట్రో స్టేషన్లు నిర్మించాలని హైదారాబ్ ఎయిర్ పోర్ట్ మెట్రో రైల్ భావిస్తోంది. రాయదుర్గం వద్ద మొదటి స్టేషన్ ప్రారంభం కాగా ఆ తర్వాతి స్టేషన్లు.. బయోడైవర్సిటీ కూడలి, నానక్ రాంగూడ కూడలి, నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్, శంషాబాద్ పట్టణం, విమానాశ్రయంలో జారీయ రహదారికి కొద్ది దూరంలో, విమానాశ్రయం టెర్మినల్ లో భూగర్భ మెట్రోస్టేషన్‌తో ముగియనున్నట్లు తెలుస్తోంది. అయితే వంపులు లేని చోట్ల స్టేషన్లు నిర్మిస్తారు. సమస్యలు ఉంటే మార్పులు, చేర్పులకు అవకాశం ఉండేలా స్టేషన్ల మార్కింగ్ ఉండనుంది.
మెట్రో ప్రయాణ వేగం, బ్రేకింగ్ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని వాటిని ఖరారు చేస్తారు. అయితే భవిష్యత్తులో మరో నాలుగు స్టేషన్లు కూడా ఏర్పాటు చేసుకునేలా అలైన్ మెంట్ ను డిజైన్ చేశారు. భవిష్యత్తులో నార్సింగి, అప్పాకూడలి మధ్య మంచిరేవుల వద్ద ఒక స్టేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే అప్పాకూడలి, రాజేంద్రనగర్ మధ్యలో కిస్మత్ పూర్ లోనూ ఓ స్టేషన్ నిర్మిస్తారట. రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్ పట్టణం మధ్యలో చాలా దూరం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఓ స్టేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనావాసాలు పెరిగితే మరో స్టేషన్ ను కూడా నిర్మించే యోచనలో హెచ్ఏఎంఎల్ ఉంది.
ప్రాజెక్టు వ్యయం, టెండర్ విలువ వేర్వేరు
రాయదుర్గం నుండి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో ప్రాజెక్టుకు మొత్తం వ్యయం అంచనా రూ. 6,250 కోట్లు. అయితే ప్రస్తుతం మాత్రం రూ. 5,688 కోట్లకే టెండర్లను ఆహ్వానించారు. ఈ రెండింటి మధ్య తేడా గురించి హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు వ్యయం, టెండర్ విలువ రెండూ వేర్వేరని చెప్పుకొచ్చారు ఎన్వీఎస్ రెడ్డి. అంచనా వేసిన టెండర్ విలువలో జీసీ ఖర్చు, ఆకస్మిక పరిస్థితులు, మల్టీ మాడల్ ఇంటిగ్రేషన్ వంటివి ఉండవని.. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో మాత్రం అవి ఉంటాయని తెలిపారు. అందుకే ప్రాజెక్టు వ్యయం, టెండర్ మధ్య వ్యత్యాసం ఉంటుందని స్పష్టం చేశారు.