Manda Krishna Madiga Emotional: మాదిగల్ని మనుషులుగా చూడలేదు, మాకోసం వచ్చిన పెద్దన్న మోదీ: వేదికపై మందకృష్జ కంటతడి
Madiga Vishwarupa Sabha In Parade Grounds: మాదిగల్ని సమాజంలో మనుషులుగా చూడలేదని, తాము ఎదురైతే దూరం దూరం వెళ్లేవారంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్జ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు.
PM Modi Attends Madiga Vishwarupa Sabha: హైదరాబాద్: మాదిగల్ని సమాజంలో మనుషులుగా చూడలేదని, తాము ఎదురైతే దూరం దూరం వెళ్లేవారంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్జ మాదిగ (Manda Krishna Madiga) సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను పశువుల కంటే హీనంగా సమాజం తమను చూసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ (Parade Ground, Secunderabad)లో ఏర్పాటుచేసిన మాదిగల తరఫున మాదిగల విశ్వరూప సభకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)కి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాము ఊహించని కల అన్నారు. సమాజంలో తమను హీనంగా చూసిన రోజు నుంచి, మనల్ని గుర్తించి, మన సమస్యల్ని తెలుసుకునేందుకు దేశానికి పెద్దన్న అయిన ప్రధాని మోదీ వచ్చారంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
మంద కృష్జ మాదిగ మాట్లాడుతూ.. ‘తమ సామాజిక వర్గానికి ధైర్యం చెప్పిన నేత ప్రధాని మోదీ. దశాబ్దాలుగా మమ్మల్ని హీనంగా చూశారు. మాదిగలకు పెద్దన్నగా మోదీ మాకోసం వచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లా మాటలు చెప్పే పార్టీ బీజేపీ కాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల సామాజిక న్యాయం కేవలం ఉపన్యాసాలకు పరిమితమైంది. బీసీని సీఎం చేస్తానని చెప్పిన దమ్మున్న నేత మోదీ. అంబేద్కర్ స్ఫూర్తితో దేశానికి సామాజిక న్యాయం చేస్తున్న వ్యక్తి ప్రధాని మోదీ. పేద కుటుంబం నుంచి వచ్చిన బీసీ వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారు. ప్రపంచ దేశాలలో ప్రభావం చూపుతున్న నేతగా ఎదిగారు. తెలంగాణ గడ్డమీద సైతం బీసీ బిడ్డను సీఎం చేస్తానని మీరు చేసిన ప్రకటన మాకు ఎంతో ధైర్యాన్నిచ్చారు.
సామాజిక న్యాయం అనే అజెండా లేకపోతే ప్రధాని మోదీ మా మీటింగ్ కు వచ్చే వారు కాదు. బీసీల కంటే అట్టడుగున ఉన్న దళితుల్ని రాష్ట్రపతిని చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక గిరిజనుల్ని సైతం రాష్ట్రపతి చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇలాంటివి జరగలేదు. కేసీఆర్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన వారిలో నేను ఒకడిని. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో 18 మంది మంత్రులుంటే ఒక్క మాదిగ మంత్రి లేరు. 10 మంది మాదిగ ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. వెలమ సామాజికవర్గం ఒక్కశాతం కూడా లేకున్నా కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, హరీష్ రావు ఇలా ఎంతో మంది మంత్రులయ్యారు. రెడ్లలో ఏడుగురు మంత్రులయ్యారు. కానీ మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు’ అని పలు కీలకాంశాలు ప్రస్తావించారు మంద కృష్జ మాదిగ.
1994లో ఉద్యమం మొదలుపెట్టాం. 30 ఏళ్లు కావొస్తుంది. ఎస్సీల్లో మాదిగలకు అన్యాయం జరిగిందని అన్ని కమీషన్లు చెప్పాయి. మాకు న్యాయం జరగాలని ప్రముఖులు, సంఘాలు చెప్పినా వర్గీకరణ జరగలేదు. దాంతో విద్య, ఉద్యోగాలలో మాదిగలు అభివృద్ధి చెందలేదన్నారు. పలు పార్టీలు ఎస్సీ వర్గీకరణకు మ్యానిఫెస్టోలో పెడుతున్నాయి. అసెంబ్లీలో తీర్మానాలు చేస్తారు, కానీ అమలు జరగలేదన్నారు. పండిత్ ధీన్ దయాల్, అంబేద్కర్ సామాజిక న్యాయం ఎవరికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కనుక తమ ఆకాంక్ష నెరవేర్చాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ చేసే నేత మోదీ ఒక్కరేనని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీపై, బీజేపీపై కొంచెం దుష్ప్రచారం జరుగుతోందన్నారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసి తమకు న్యాయం చేయాలని తన ప్రసంగంలో మోదీని కోరారు మందకృష్ణ మాదిగ.