TS Gas Cylinder For Rs.500: మహాలక్ష్మి స్కీమ్‌పై బిగ్ అప్‌డేట్- బీపీఎల్ కుటుంబాలకే బెనిఫిట్
Mahalakshmi scheme: తెలంగాణలో మహాలక్ష్మీ పథకం అమలుకు నిబంధనలు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకం అని తేల్చిచేప్పింది. దీంతో మధ్యతరగతి ప్రజలు నిట్టూరుస్తున్నారు.
TS Mahalakshmi Scheme: ఎన్నికల వేళ ఆరు గ్యారెంటీలతో ప్రచారం చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటి అమలుపై సీరియస్‌గా కసరత్తు చేస్తోంది. అయితే అర్హులైన వారికే పథకం అందేలా చూస్తోంది. ఇందులో ముఖ్యమైంది మహాలక్ష్మి పథకం. 500 రూపాయలకే వంట గ్యాస్, మహిళలకు నెలకు రూ.2,500 రూపాయలు వంటి పథకాలు ప్రజలను ఆకర్షించాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి... గ్యారెంటీ స్కీమ్స్ అమలు చేయబోతోంది. రేపటి నుంచి ప్రజాపాలన పేరుతో... గ్యారంటీ పథకాల కింద దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్యారెంటీ పథకాల అమలు కోసం... దరఖాస్తు ఫారంను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క విడుదల చేశారు. ఈ క్రమంలో... రూ.500కే గ్యాస్ సిలిండర్ వస్తుందని చాలా మంది భావించారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం... తెల్ల రేషన్ కార్డుతో ముడిపెట్టింది. అంటే.. బిలో పోవర్టీ లైన్ (బీపీఎల్) అంటే దారిద్య్ర రేఖకు దిగువనున్న నిరపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో... మధ్యతరగతి ప్రజలు నిరాశ చెందుతున్నారు.
హైదరాబాద్ మహానగరంలో చాలా మందికి రేషన్ కార్డులు లేవు. గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డులు మొక్కబడిగా తప్పితే... సక్రమంగా ఇచ్చిన దాఖలాలు లేవు. దీంతో రేషన్‌కార్డు లేని కుటుంబాల సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు.. మహాలక్ష్మి పథకం కింద... వారికి సబ్సిడి గ్యాస్ వస్తుందా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నా... అందుకు పలు నిబంధనలు వర్తిస్తాయి. ఈ విధానం వల్ల దిగువ మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారు. నిరుపేదలకు మాత్రమే.. సిలిండర్ సబ్సిడీ వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
ఇక, హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో... జనాభా ఎక్కువ. వివిధ రాష్ట్రాలకు చెందిన వారు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. తెలంగాణలో ఓటు హక్కు ఉన్నా... రేషన్ కార్డు మాత్రం పొందలేకపోయారు. మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి..? అన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు 30 లక్షలపైనే వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్టు సమాచారం. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం వలస వచ్చిన కుటుంబాలతో మరో పది లక్షల అనధికార కనెక్షన్లు కూడా ఉన్నాయి. అయితే... తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు మాత్రం 17లక్షల 21వేలు మాత్రమే. మిగిలిన కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. వీరిలో బీపీఎల్ కుటుంబాలు మరో పది లక్షల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. మరి... మిగిలిన కుటుంబాల పరిస్థితి ఏంటి..? ఈ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.
ప్రస్తుతం.. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.955. దీనికి తోడు సిలిండర్‌ను ఇంటికి తెచ్చి ఇచ్చిన డెలీవరీ బాయ్ మాములు. వెరసి.. సిలిండర్ ధర సుమారు రూ.1000. ప్రస్తుతం వినియోగదారులు సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. అయితే... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆకె గ్యారంటీలో ఒకటైన మహాలక్ష్మి పథకం కింద అర్హత పొందితే... కేవలం రూ.500కే సిలిండర్ వర్తించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. తమకు సబ్సిడీ రావాలని చాలా మంది ఆశపడతారు. కానీ... తెల్ల రేషన్ కార్డు తప్పనిసరని కాంగ్రెస్ రూల్ పెట్టడంతో... చాలా మందికి నిరాశే మిగులుతోంది. అది ప్రభుత్వంపై వ్యతిరేకతగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.