Drugs In Hyderabad: డ్రగ్స్ కేసులో ఏ29గా హీరో నవదీప్ - వెల్లడించిన హైదరాబాద్ పోలీసులు
Madhapur Drugs Case: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ కేసులో 29వ నిందితుడిగా నవదీప్ పేరు చేర్చినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
Madhapur Drugs Case Hero Navadeep: టాలీవుడ్ లో ఇదివరకే డ్రగ్స్ కేసు కలకలం కేపింది. తాజాగా మరోసారి మాదాపూర్ డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీకి లింకులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ డ్రగ్స్ కేసుతో నవదీప్ కు సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు. నవదీప్ డ్రగ్స్ సేవించినట్లుగా హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో 29వ నిందితుడిగా నవదీప్ పేరు చేర్చినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో ఇదివరకే ఫిల్మ్ ఫైనాన్షియర్ వెంకటరమణారెడ్డితో పాటు డియర్ మేఘ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి ని అరెస్ట్ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను నార్కోటిక్ పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. ఆ రాంచంద్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. నవదీప్ ను కన్స్యూమర్ గా ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. దాంతో మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు చేర్చి దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో నవదీప్ పేరు (ఏ29)ను చేర్చినట్లు సమాచారం. నటుడు నవదీప్ పరారీలో ఉన్నారని గురువారం పలు మీడియాలలో కథనాలు రాగా, తాను ఎక్కడికి పారిపోలేదని, ఈ కేసులో ఇరుక్కున్న నవదీప్ తాను కాదని స్పష్టం చేశారు. కానీ శుక్రవారం నాడు పరిస్థితి మారిపోయింది. నిందితులు తరచుగా హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
ఇప్పటికే ముగ్గురు నైజీరియన్ లతో సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్ కు తరలించారు. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నటుడు నవదీప్ పరారీలో ఉన్నాడని తెలిపారు. నోటీసులు ఇవ్వడానికి యత్నించగా అతడుగానీ, అతడి కుటుంబంగానీ అందుబాటులో లేదని, ఫోన్లు సైతం స్విచ్ఛాఫ్ వచ్చాయని పోలీసులు చెబుతున్నారు. ఇదే కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు.
గురువారం స్పందించిన నవదీప్..
డ్రగ్స్ కేసుతో హీరో నవదీప్ నకు సంబంధం ఉందన్న వార్తలపై తన సోషల్ మీడియా వేదికగా గురువారం స్పందించారు. పోలీసులు చెప్పిన తాను కాదని పేర్కొన్నారు. ‘తాను ఎక్కడికి పారిపోలేదని, పరారీలో లేనని.. ఇక్కడే ఉన్నాను. దయచేసి క్లారిటీ తెచ్చుకోండి, థాంక్స్’ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో నవదీప్ పోస్ట్ చేశారు. పోలీసులు హీరో నవదీప్ అని ఎక్కడా పేర్కొనలేదని, అది తాను కాదని ఓ మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. కానీ పోలీసులు మాత్రం మాదాపూర్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో హీరో నవదీప్ పేరును చేర్చారు.