KA Paul: ‘కృష్ణ చనిపోలేదు, జస్ట్ ట్రాన్స్‌ఫర్ అయ్యారు’ - పార్థివదేహం వద్ద కేఏ పాల్ ప్రార్థన
కృష్ణ గారు ఫిజికల్‌గా చనిపోయినట్లు కాదని, ఈ లోకం నుంచి పరలోకానికి జస్ట్ ట్రాన్స్‌ఫర్ అయ్యారని కేఏ పాల్ అన్నారు.
నటులు ఎంతో మంది ఉంటారని, కానీ శాంతిని కోరే మంచి మనిషి కృష్ణ గారు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ అన్నారు. ఆయన మంగళవారం సాయంత్రం నానక్‌రామ్‌గూడలో కృష్ణ ఇంట్లో ఉంచిన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత పార్థివదేహం పక్కనే ప్రార్థన చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ మేరకు కృష్ణ మృతి పట్ల సంతాపం తెలుపుతూ మహేష్ బాబుకు ధైర్యం చెప్పి ఓదార్చారు. అనంతరం అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు. కృష్ణ గొప్పతనం గురించి మాట్లాడుతూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన గురించి కీలక విషయాలు వెల్లడించారు.
కృష్ణ గారు ఫిజికల్‌గా చనిపోయినట్లు కాదని, ఈ లోకం నుంచి పరలోకానికి జస్ట్ ట్రాన్స్‌ఫర్ అయ్యారని కేఏ పాల్ అన్నారు. కృష్ణతో తనకున్న ఆత్మీయ పరిచయం చాలా గొప్పదని పాల్ గుర్తు చేసుకున్నారు. 26 సంవత్సరాల క్రితం తన శాంతి సభకు కృష్ణ వచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయన కోరిక ఒక్కటే ఉండేదని అని కేఏ పాల్ చెప్పారు. పాల్ సర్.. మీ శాంతి సందేశాలను ఒక సినిమాగా చేద్దామనుకుంటున్నా అని కృష్ణ అన్నారని గుర్తు చేశారు. ఆయన చెప్పినట్లుగానే శాంతి సందేశం లాంటి మంచి సినిమాను కృష్ణ తీశారని తెలిపారు.
‘‘కృష్ణ తన జీవితాన్ని శాంతి కోసం, మంచి కోసం, చారిటీల కోసం తపించారు. మా చారిటీస్ కి వచ్చినప్పుడు పిల్లలతో సరదాగా గడిపేవారు. ఈరోజు ఆయన పీస్ ఫుల్ గా దేవుడి దగ్గరికి ప్రమోట్ అయ్యారు.’’ ఆయన పేరిట ఆయన పిల్లలు, మనవళ్లు కృష్ణ గారి పేరుతో చారిటీ చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను.
నేడు హైదరాబాద్‌కు సీఎం జగన్, సూపర్ స్టార్ కృష్ణకు నివాళులు
సూపర్ స్టార్ కృష్ణకు నివాళి అర్పించడానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కాసేపట్లో హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. హైదరాబాద్ పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకుని సూపర్‌స్టార్ పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పిస్తారు. అనంతరం ఘట్టమనేని కుటుంబాన్ని పరామర్శిస్తారు. నేడు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో సూపర్ స్టార్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహిస్తారు.
నేడు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు, పద్మాలయ స్టూడియోలో పార్థివదేహం
తెలుగు సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నేడు అధికార లాంఛనాలతో హైదరాబాదులోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. సోమవారం ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసారు ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు ఆయన మృతదేహాన్ని సందర్శించారు. ఘనంగా నివాళులు అర్పించారు.