Ayodhya Pran Pratishtha: హైదరాబాద్‌లో రాముడి ప్రాణ ప్రతిష్ట ఉత్సవాలు, భక్తులకు నిర్వాహకుల ఆహ్వానం
Ayodhya Ram Mandir Inauguration: అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నడిబొడ్డున వేడుకలు నిర్వహించనున్నారు.
Ayodhya Ram Prana Pratishta: హైదరాబాద్: ప్రపంచంలో పలు దేశాలు ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్య వైపు చూస్తున్నాయి. దాదాపు 5 శతాబ్ధాల తరువాత అయోధ్యలో రాముడి మందిరం కొలువుతీరనుంది. జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్టలో భాగంగా బాల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దేశ వ్యాప్తంగా ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు పలు చోట్ల లైవ్ చూసే ఏర్పాట్లు చేశారు. మల్టీప్లెక్స్ లు సైతం రామ మందిరం ప్రారంభోత్సవాన్ని ప్రదర్శించనుంది.
దేశంలో ఎటు చూసినా రామనామమే వినిపిస్తోంది. అయోధ్యలో రామయ్య కొలువుదీరే క్షణం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నడిబొడ్డున వేడుకలు నిర్వహించనున్నారు. చరిత్రలో నిలిచిపోయేలా వేడుకలు నిర్వహించాలని కృష్ణ ధర్మపరిషత్ (ఆల్ ఇండియా) ఏర్పాట్లు చేస్తోంది. హిందువుల ఐక్యతను చాటిచెప్పేలా ప్రాణ ప్రతిష్ట విజయ్ దివస్ నిర్వహిస్తున్నామని కృష్ణ ధర్మపరిషత్ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్ తెలిపారు.
హైదరాబాద్‌లో ఎక్కడంటే..
కృష్ణ ధర్మపరిషత్ (ఆల్ ఇండియా) ఆధ్వర్యంలో ఈ నెల 22న (సోమవారం) హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహాం పక్కన, ప్రసాద్ మల్టీప్లెక్స్ సమీపంలో వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ ఐక్యత చాటేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. జనవరి 22న మధ్నాహ్నం 4 గంటల నుంచి కార్యక్రమాలు మొదలవుతాయి. రాముడి పూజతో అంకురార్పణ చేయనున్న ఈ కార్యక్రమానికి భారీగా తరలిరానున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అభిషేక్ గౌడ్ వెల్లడించారు.
హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక వాతావరణం..
ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులను ఆధ్యాత్మిక వాతావరణం చూపించేలా గణేష్, శ్రీరామ్, హనుమాన్ కీర్తనలు, పాటలతో భక్తిలహరి ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామచరిత్ర ప్రదర్శనతో పాటు ప్రత్యేకంగా అయోధ్య ప్రత్యేకత, విశిష్టత వివరించేలా డాక్యుమెంటరీ ప్రదర్శించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కృష్ణ ధర్మపరిషత్ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్, కార్యదర్శి సాయిరామ్ యాదవ్, ఉపాధ్యక్షులు అనిష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, కార్యదర్శి అశోక్ ప్రజలకు పిలుపునిచ్చారు.