Komatireddy: నీకు సిగ్గుందా? సంస్కారం ఉందా? ఛాలెంజ్ విసిరిన కోమటిరెడ్డి, నిరూపిస్తే రాజకీయ సన్యాసమేనని వ్యాఖ్యలు
టీడీపీలో ఉన్న సమయంలో సోనియా, రాహుల్, వైఎస్ఆర్ ను దూషించిన రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.
మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లక్ష్యంగా విపరీతమైన ఆరోపణలు చేశారు. టీడీపీలో ఉన్న సమయంలో సోనియా, రాహుల్, వైఎస్ఆర్ ను దూషించిన రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు. ఆయనది అసలు కాంగ్రెస్ రక్తం కాదని, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వెన్నంటే ఉన్న తాము అసలు కాంగ్రెస్ రక్తం అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో బ్లాక్ మెయిలర్లకు స్థానం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఏఐసీసీ ప్రెసిడెంట్ అయినా ఎవరూ నమ్మరని అన్నారు.
మునుగోడులో బట్టలిప్పి కొడతారు
‘‘రేవంత్ రెడ్డిని పీసీసీ చేయాలని హైకమాండ్ కు రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పారనేది అబద్ధం. పీసీసీ అయ్యాక నాతో 3 గంటలు మాట్లాడినది కూడా పచ్చి అబద్ధం. అన్ని కమిటీలు కూడా ఇష్టమొచ్చినట్లుగా నియమించారు. అయినా మేమేం మాట్లాడలేదు. నీకు క్యారెక్టర్ లేదు. నోటికొచ్చినట్లుగా మాట్లాడితే మునుగోడులో జనం బట్టలిప్పి కొడతరు. నాకోసం ఇక్కడ ప్రాణమిస్తారు. పండబెట్టి తొక్కుతా లాంటి సినిమా డైలాగులు మాట్లాడొద్దు. పెయిడ్ వర్కర్స్ ను పంపించి ఎక్కడికిపోయినా జిందాబాద్ కొట్టించుకుంటావు’’ అని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పథకం ప్రకారమే కాంగ్రెస్ లోకి రేవంత్
‘‘నేను సోనియాను విమర్శించను. పదవి కోసం అయితే టీఆర్ఎస్‌లోకే వెళ్ళేవాడ్ని. మంత్రి పదవి ఆశ చూపించినా నేను టీఆర్ఎస్‌లోకి వెళ్ళలేదు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడేందుకే బీజేపీలోకి పోతున్నా. రేవంత్ రెడ్డి ఒక ప్లాన్ ప్రకారమే టీడీపీని ఖతం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు చంద్రబాబును ఎందుకు వదిలేశావు రేవంత్ రెడ్ది? ఒక పథకం ప్రకారం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చాడు. ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని దోచుకోవడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి రాజీనామాని చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. స్పీకర్ ఇచ్చి ఆమోదింపచేసుకున్నారా. నాలాగా రాజీనామా చేసి ఉప ఎన్నికకి పోవాల్సింది. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాలుగో పార్టీ.’’
‘‘రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తాడని ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రైట్ యాక్ట్ ప్రకారం వివరాలు తీసుకొని వ్యాపారులని బ్లాక్మెయిల్ చేసింది రేవంత్ రెడ్డి కాదా. జూబ్లీహిల్స్ లో ఇల్లు కట్టించావు. వేల కోట్లు ఎట్లా వచ్చాయి.. మాలాగా నువ్వు వ్యాపారాలు చేస్తున్నావా? ఆత్మగౌరవం చంపుకుని రేవంత్ రెడ్డి కింద పనిచేయడానికి పార్టీ నేతలు సిద్ధంగా లేరు. రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలిదేవత అనలేదా?
వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోతే మేమంతా బాధపడుతుంటే.. వైయస్ పావురాల గుట్టమీద పావురం అయిపోయాడని రేవంత్ రెడ్డి అన్నారు.’’ అని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు.
‘‘కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి సంతోషంగా ఉన్నారా? రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత వెంకటరెడ్డి, జగ్గారెడ్డి ఎన్నిసార్లు బహిరంగంగా విమర్శించారు. మునుగోడు అభివృద్ధి ఆత్మగౌరవం కోసం నేను రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోతున్నా. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సక్రమంగా నడపాలి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ వల్లే అవుతుంది.’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడారు.