KA Paul On KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బహిష్కరించండి- అమరవీరుల కుటుంబాలకు కేఏ పాల్ పిలుపు
రేపు ఉదయం 9 గంటలకు ప్రజాశాంతి పార్టీ కార్యాలయం నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు వందమంది తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని ప్రకటించారు కేఏ పాల్.
ప్రత్యేక తెలంగాణ రావడానికి కారణమైన అమరవీరుల కుటుంబాలకు ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. త్యాగాలు వారివి అయితే... భోగాలు మాత్రం వేరే వాళ్లు తీసుకున్నారని టీఆర్‌ఎస్ లీడర్లపై మండిపడ్డారాయన. టీఆర్‌ఎస్ లీడర్లు అనుభవిస్తున్న రాజభోగాలు నాటి అమరవీరుల త్యాగాల ఫలితమేనన్నారు. అలాంటి వారికి న్యాయం చేయలేదని మండిపడ్డారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే అనేది చర్చే అవసరంలే విషయం అన్నారు కేఏ పాల్. తెలంగాణ రాష్ట్రసాధనలో అమరుల పాత్ర అజరామరమైనదన్నారు. అలాంటి వారిని నిర్లక్ష్యం చేయటం తగునా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు తీసుకున్న వారి కుటుంబ సభ్యులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని ప్రశ్నించారు. అలాంటి వారు ఇప్పుడు రోడ్డున పడ్డారని వాపోయారు.
నిజమైన తెలంగాణవాదులు, నిజమైన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు నేడు నిర్లక్ష్యానికి గురి అవుతున్నారని అభిప్రాయపడ్డారు కేఏపాల్. చేతికి అందివచ్చిన బిడ్డలను కోల్పోయి, గుర్తింపునకు నోచుకోక, పేదరికంతో, ప్రభుత్వ సాయం అందక, ఎంతో దీనావస్థలో ఉన్నారని వివరించారు. వారి కుటుంబాల పరిస్థితి విని, చూసి, తన హృదయం చలించిపోయిందన్నారు. వాళ్ల కుటుంబాల పరిస్థితిని చూసి అమర వీరుల ఆత్మలు ఘోషిస్తాయని కామెంట్ చేశారు. వారి ఆత్మఘోష ఈ ప్రభుత్వానికి కచ్చితంగా తగిలి తీరుతుందన్నారు. ఇవే ఈ ప్రభుత్వానికి చివరి రోజులని శాపించారు కేఏ పాల్.
రాజభోగాలు మత్తులో ఉన్న టీఆర్‌ఎస్ లీడర్లకు వారి ఆర్తనాదాలు వినిపించడం లేదని మండిపడ్డారు కేఏ పాల్. గత 8 సంవత్సరాల పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు చేసింది శూన్యమన్నారు. పన్నెండు వందల అమరుల కుటుంబాల్లో 546 మందికి మందిని గుర్తించారన్నారు. వాళ్లలో కూడా రెండు వందల నలభై మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని వివరించారు.
కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని... అలాంటప్పుడు ఎందుకీ అహంకారమని ప్రశ్నించారు పాల్. సకల జనుల సమ్మె మొదలుకొని తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపింది తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాల స్ఫూర్తి కాదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో కనీసం గుర్తింపునకు నోచుకోని ఉద్యమకారులు ఎందరో ఉన్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి గౌరవించడం చేతకాలేదా అని నిలదీశారు.
ఆత్మత్యాగానికి సిద్ధపడి, ఆత్మహత్య యత్నంలో భాగంగా అవయవాలతోపాటు సర్వస్వాన్ని కోల్పోయి దివ్యాంగులుగా మిగిలిపోయిన 300 మంది కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు పాల్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మొదటి నుంచి మద్దతు తెలిపిన తాను అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటానన్నారు. ప్రజాశాంతి పార్టీ తరఫున తెలంగాణ అమరవీరుల ఆశయ సాధనకై పోరాటం చేస్తామని పోరాడి సాధించుకుంటామని... తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని భారీ ప్రకటన చేశారు.
తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. వీరి కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు కేఏ పాల్. ఈ పన్నెండు వందల అమరవీరుల కుటుంబాలనే కాకుండా, ఆత్మహత్యలకు సిద్ధమై దివ్యాంగులుగా మారిన 300 మందితోపాటు, ప్రతి ఒక్క ఉద్యమకారుడుని గుర్తించి పూర్తిస్థాయిలో ఆదుకుంటామన్నారు.
ప్రజాశాంతి పార్టీ తరఫున 20 శాతం అసెంబ్లీ టికెట్లు అమరుల కుటుంబసభ్యులకు కేటాయిస్తామని... ఉద్యమకారులకు మరో 10 శాతం టికెట్లు ఇస్తామన్నారు కేఏ పాల్. రానున్న తమ ప్రభుత్వంలో అమరవీరుల కుటుంబాలకు హైదరాబాదులో జర్నలిస్ట్ కాలనీ తరహా కాలనీ నిర్మిస్తామని ప్రకటించారు. ఉద్యమకారులపై ప్రభుత్వం బనాయించిన బూటకపు కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేసుల ఆధారంగా ప్రతి ఒక్క ఉద్యమకారుడి గుర్తించి తగిన గౌరవ వేతనాన్ని అందిస్తామని తెలిపారు.
అమరవీరుల త్యాగాలు చిరస్థాయిగా గుర్తుంచుకునేలా, అమరవీరుల విగ్రహాలుతో కూడిన పార్కులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు కే ఏ పాల్. అమరవీరుల తల్లిదండ్రులకు పింఛన్లు, వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం, వారి పిల్లలకు ఉచిత విద్య ప్రభుత్వం తరఫున అందిస్తామని తెలిపారు. పదిహేను వందల కుటుంబాల్లో ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు కేఏ పాల్. వారి వారి గ్రామాలలో సేద్యానికి అనువైన ఐదెకరాల భూమిని కేటాయిస్తాం.
వీరి బిడ్డల త్యాగాలవల్ల సిద్ధించిన తెలంగాణ వాళ్లే పాలించుకుంటారన్నారు పాల్. వాళ్లకు రాజ్యాధికారాన్ని అందించే దిశగా ప్రజాశాంతి పార్టీ కృషి చేస్తోందని ప్రజలే వాళ్లకు రాజ్యాన్ని రాజ్యాధికారం ఇస్తారన్నారు. రేపు ఉదయం 9 గంటలకు ప్రజాశాంతి పార్టీ కార్యాలయం నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ఈ వందమంది తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామని ప్రకటించారు.