Jubilee hills Rape Case: గ్యాంగ్ రేప్ కేసులో మరోసారి బాలిక స్టేట్‌మెంట్ రికార్డు, కీలక వివరాలు బయటికి
ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందు కోసం ఇప్పటిదాకా అరెస్టు చేసిన నలుగురు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును పోలీసులు కోరారు.
జూబ్లీహిల్స్‌లో అత్యాచార ఘటన కేసులో పోలీసులు మరోసారి బాధితురాలిని విచారణ జరిపారు. సోమవారం ఆమె వాంగ్మూలాన్ని మరోసారి మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేశారు. ఈ సంచలన కేసులో ఇప్పటికే కీలకమైన ఆధారాలు పోలీసులు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వాంగ్మూలంలో భాగంగా నిందితులు అమ్మాయిలను లోబర్చుకునేందుకు ముందుగానే ప్లాన్ వేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. పబ్ లో చేసుకుంటున్న ఫేర్ వెల్ పార్టీలో నిందితులు అమ్మాయిలతో కావాలని కలిసిపోయి ఉన్నారని, వారి పక్కనే కూర్చొని కావాలని తాకుతూ ఉన్నారని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియోలను చూసి పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. పార్టీలో లంచ్ కార్యక్రమం ముగిశాక, నిందితులు అమ్మాయిలను దిగబెడతామని వారితో చెప్పినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే, వారి ప్రవర్తన చూసిన వారు తాము రాబోమని తెగేసి చెప్పారు. బుద్ధిగా ఉంటామని నమ్మబలకడంతో ఈ బాధిత బాలిక వారి కారులో వచ్చింది.
అయితే, ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందు కోసం ఇప్పటిదాకా అరెస్టు చేసిన నలుగురు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును పోలీసులు కోరారు. ఎమ్మెల్యే కొడుకు పాత్రపై న్యాయ సలహా తీసుకొని చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఆరో నిందితుడిగా ఎమ్మెల్యే కుమారుడిని చేర్చనున్నట్లు వెల్లడించారు. అత్యాచార ఘటనలో ఎమ్మెల్యే కుమారుడిపై పెట్టనున్న కేసుపై కాస్త ఉత్కంఠ నెలకొని ఉంది.
ఇప్పటికే నిందితులు వాడిన కారులో క్లూస్ టీం నిపుణులు బాలిక చెవి కమ్మలు, చెప్పులు, వెంట్రుకల నమూనాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాక, నిందితుల వీర్యం మరకలను కూడా నిపుణులు గుర్తించారు. అందులో నిందితులు తుడుచుకున్న టిష్యూ పేపర్లను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.
రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
ఈ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. నిందితులు బాధిత బాలికతోపాటు మరో బాలికను కూడా వేధించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం మొత్తానికి కార్పొరేటర్ కుమారుడే కీలక సూత్రధారిగా పోలీసులు నిర్థారించారు. అతడు సాదుద్దీన్ మాలిక్‌తో కలిసి పబ్‌లో అరాచకాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సాదుద్దీన్ మాలిక్, కార్పొరేటర్ కొడుకు కలిసి ఇద్దరు బాలికలను వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వేధింపులు భరించలేక పబ్ నుంచి బాలికలు ఇద్దరూ బయటకు వచ్చేశారు. అయితే ఒక బాలిక పబ్ నుంచి బయటకు నేరుగా క్యాబ్ తీసుకొని వెళ్లిపోయింది. సాదుద్దీన్ అండ్ గ్యాంగ్ బాలికల వెనకాలే బయటకు వచ్చారు. పబ్ ముందే నిలబడ్డ బాధిత బాలికను కార్పొరేటర్ కొడుకు ట్రాప్ చేశాడు. ఇంటి వద్ద దించుతామని నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మనవడు ఉమేర్‌ఖాన్‌కు చెందిన బెంజ్ కారులో అమ్మాయితో కలిసి నలుగురు ప్రయాణం చేశారు.
ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫొటో
పబ్ నుంచి నేరుగా కాన్సూ బేకరి వరకు కారులో వెళ్లారు. బెంజ్ కారులోనే అమ్మాయి పట్ల గ్యాంగ్ అసభ్యంగా ప్రవర్తించారు. అరాచకాలు భరించలేక కాన్సూ బేకరి నుంచి వెళ్లిపోతానని బాధిత బాలిక చెప్పింది. బాలికను మళ్లీ బెంజ్ కారులో ఎక్కించుకొని కొద్దిదూరం ప్రయాణం చేశారు. అయితే ఫోన్ కాల్ రావడంతో ఎమ్మెల్యే కుమారుడు మధ్యలోనే కారు దిగి వెళ్లిపోయాడు. బెంజ్ కారులో పెట్రోల్ అయ్యిపోయిందంటూ డ్రామాలు ఆడిన యువకులు, వెనకాలే వచ్చిన ఇన్నోవాలో కారులోకి బాలికను తరలించారు. ఇన్నోవాలో వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ కుమారుడు ఉన్నాడు. బంజారాహిల్స్‌లో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు. గ్యాంగ్ రేప్ తర్వాత బేకరికి వచ్చిన నిందితులు, ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫొటో దిగి ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఆ తర్వాత నిందితులు బేకరి నుంచి ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.