YS Jagan Case: జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా - హైకోర్టు కీలక వ్యాఖ్యలు
YSRCP News: జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణను త్వరగా విచారణ పూర్తి చేయాలని దాఖలైన పిల్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. దీన్ని సెప్టెంబరు 17కు వాయిదా వేసింది.
YS Jagan News: వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమ కేసుల విచారణ ఇంకోసారి వాయిదా పడింది. ఆయన కేసుల విచారణను త్వరగా విచారణ చేయాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. దానిపై మంగళవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. ఈ పిల్ ను హరిరామ జోగయ్య దాఖలు చేశారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను వీలైనంత త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్న విషయాన్ని పిటిషనర్ గుర్తు చేశారు. ఈ క్రమంలో పిటిషన్లపై విచారణను సెప్టెంబర్ 17కు తెలంగాణ హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. అయితే, జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఇప్పటికే సీబీఐకి కోర్టుకు నోటీసులు ఇవ్వటం జరిగిందని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి.
ఈ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకొంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. జగన్ కేసులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వచ్చిన తర్వాతనే.. ఈడీ కేసుల్లో తీర్పులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు గతంలో ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారణ చేసినా ఆ పద్ధతినే ఫాలో అవ్వాలని అప్పట్లో స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును గతేడాది మే నెలలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఆగస్టు 14న ఈడీ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఆ సమయంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ఇద్దరు సభ్యులతో కూడిన బెంచ్ ఈడీ పిటిషన్ ను విచారణ చేసింది. అయితే, కేసు ప్రారంభం అయిన వెంటనే తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్టుగా జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. వాదనలు వినిపించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సిద్థం కాగా.. జస్టిస్ సంజీవ్ కుమార్ లేని ధర్మాసనం ముందు పిటిషన్‌ను లిస్ట్ చేయనున్నట్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు. సెప్టెంబరు 2 నుంచి మొదలయ్యే వారంలో సీజేఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్ట్ చేయాలని సంజీవ్ ఖన్నా ఆదేశించారు.