International Yoga Day 2025: చక్ర సిద్ధ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మోకిలాలో అంతర్దాతీయ యోగా డే వేడుకలు
International Yoga Day 2025:హైదరాబాద్‌లోని మోకిలాలో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. చక్ర సిద్ధ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.

International Yoga Day 2025:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చక్ర సిద్ధ వారి ఆధ్వర్యంలో హైదరాబాదులోని మోకిలాలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మహిళా కమిషనర్ నేరెళ్ల శారద హాజరయ్యారు. చక్ర సిద్ధ వ్యవస్థాపకులు డాక్టర్ సత్య సింధుజతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సందర్భంగా నేరెళ్ల శారద మాట్లాడుతూ యుక్త వయసు నుంచి 60,70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ రోజుకు 45 నిమిషాలు కేటాయించి యోగా చేస్తే ఎంతో ఆరోగ్యదాయకమన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యోగాను జీవితంలో ఒక భాగంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళలు ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలని, యోగా చేయడం వల్ల మహిళలకు వచ్చే అనేక రకాల ఆరోగ్య సమస్యలను సైతం జయించవచ్చునన్నారు. పాఠశాలల్లోనూ సైతం ప్రతిరోజు యోగా తరగతులు నిర్వహిస్తే పిల్లలకు ఎంతో దోహదపడుతుందని శారద అభిప్రాయపడ్డారు.

చక్ర సిద్ధ వ్యవస్థాపకులు డాక్టర్ సత్య సింధుజ మాట్లాడుతూ వృత్తిపరంగా ప్రతి ఒక్కరు ఎంతో బిజీగా ఉండే ఈ రోజుల్లో ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, అలాంటివారు ప్రతిరోజు యోగా చేస్తే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా యోగా చేయాలని ఇది ముందు తరాలకు ఎంతో ఆదర్శప్రాయం అవుతుందని ఆమె తెలిపారు.






















