Hyderabad Racing: రేపటి నుంచి హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ - ఈ రోడ్లు మూసివేత
గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన లీగ్ దశ విజయవంతం అయిందని, గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఇండియన్ రేసింగ్ లీగ్ చైర్మన్ అఖిలేశ్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ పోటీలు రెండో దశ జరిగేందుకు అంతా సిద్ధం అయింది. రేపటి నుంచి (డిసెంబరు 10, 11) రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో రేసింగ్ పోటీలు జరగనున్నాయి. 11న ఉదయం 10 గంటలకు రేసింగ్ లీగ్ మొదలవుతుందని ఇండియన్ రేసింగ్ లీగ్ చైర్మన్ అఖిలేశ్ రెడ్డి తెలిపారు. ఈ లీగ్‌లో 12 కార్లు, 6 జట్లు పాల్గొననున్నాయని, ఈ రేస్ కార్లను 24 మంది డ్రైవర్లు నడిపించనున్నారని చెప్పారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పారు. శనివారం పొద్దున 10 గంటలకు ప్రాక్టీస్ సెషన్, మధ్యాహ్నం క్వాలిఫై స్ప్రింట్ పోటీలు ఉంటాయని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఫైనల్ రేస్ నిర్వహించి, ఛాంపియన్‌ను వెంటనే ప్రకటిస్తామని చెప్పారు.
గత రేసింగ్‌ల కంటే ఈసారి ప్రేక్షకుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఆశిస్తున్నట్లుగా అఖిలేష్ రెడ్డి తెలిపారు. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన లీగ్ దశ విజయవంతం అయిందని, సమాచా రలోపం వల్ల కాస్త గందరగోళం ఏర్పడిందని చెప్పారు. దాంతో వీక్షకులకు డబ్బులు వెనక్కు తిరిగి ఇచ్చేశామని అన్నారు. ఈసారి రేసింగ్ విధానాన్ని మార్చామని చెప్పారు. కేవలం ఇండియన్ రేసింగ్ లీగ్ మాత్రమే జరుగుతుందని ఆయన స్పష్టత ఇచ్చారు.
ట్రాఫిక్ మళ్లింపులు
ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులను ఈ మూడు రోజులపాటు మూసివేయనున్నారు. కొన్ని రోజుల కిందట హుస్సేన్ సాగర్ తీరంపైన రోడ్డులో ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహణ సమయంలోనూ ట్రాఫిక్ ను మళ్లించారు.
డిసెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
* వీవీ స్టాట్యూ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు అనుమతించరు. వీవీ స్టాట్యూ నుంచి షాదాన్ కాలేజీ వైపుగా రవీంద్రభారతికి ట్రాఫిక్ మళ్లింపులు
* బుద్దభవన్ వైపు, నల్లగుట్ట జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్ వైపు, ఐమాక్స్ రోటరీ వైపు నో ఎంట్రీ. అటునుంచి నల్లగుట్ట జంక్షన్ మీదుగా రాణిగంజ్/ ట్యాంక్ బండ్ మీదుగా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు.
* రసూల్‌పురా/మినిస్టర్ రోడ్ నుంచి వచ్చే వాహనాలను నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను నెక్లెస్ రోటరీ సైడ్ అనుమతించరు. ఆ వాహనాలను నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
* ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగుతల్లి జంక్షన్, ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే వాహనాలను ట్రాఫిక్ తెలుగు తల్లి వైపు అనుమతించరు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి కట్ట మైసమ్మ దేవాలయం/లోయర్ ట్యాంక్ బండ్ వైపు ట్రాఫిక్ మళ్లింపులు. లేకపోతే ఇక్బాల్ మినార్/రవీంద్ర భారతి వద్ద కుడివైపు తీసుకొని పబ్లిక్ గార్డెన్స్ జంక్షన్ - బషీరాబాగ్ - లిబర్టీ వైపు వెళ్లి BRK భవన్ లేదా ట్యాంక్ బండ్ వైపు వెళ్లవచ్చు.
* ట్యాంక్‌బండ్/తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి నెక్లెస్‌రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను అనుమతించరు. అటునుంచి ఇక్బాల్ మినార్ రవీంద్ర భారతి జంక్షన్ వైపు వాహనాల మళ్లింపులు
* బీఆర్‌కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్స్ వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ వద్ద నుంచి ఇక్బాల్ మినార్/ రవీంద్ర భారతి జంక్షన్ వైపు డైవర్షన్..
* ఖైరతాబాద్ పెద్ద గణేష్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్ వైపు, నెక్లెస్ రోటరీ వైపు అనుమతి లేదు. బడా గణేష్ వద్ద నుంచి రాజ్‌దూత్ లేన్ వైపు మళ్లిస్తారు
* ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ డిసెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు ఫార్మూలా ఈ రేసింగ్ నిర్వహణ కారణంగా మూసివేయనున్నారు.
* ఒకవేళ రేస్ నిర్వహణకు అవసరమైతే డిసెంబర్ 7, 8 తేదీల్లోనూ రాత్రివేళల్లో కొన్ని మార్గాలను మూసివేసే అవకాశం ఉంది.