పబ్‌లో మైనర్ డ్యాన్స్, మంత్రులకు, అధికారులకు వీడియో ట్యాగ్!
ఎనిమిదేళ్ల చిన్నారి పబ్‌కి వెళ్లడమే కాకుండా డ్యాన్స్ చేసింది. మైనర్లను పబ్బుల్లోకి రానివ్వడం ఏంటంటూ పలువురు ఈ వీడియోని షేర్ చేస్తూ మంత్రులు, అధికారులకు ట్వీట్ చేశారు.
అధికారులు ఎంతగా చెప్తున్నా పబ్ యజమానులు పట్టించుకోకుండా చిన్న పిల్లలను కూడా పబ్బుల్లోకి రానిస్తున్నారు. అలా వచ్చిన వాళ్లు విపరీతంగా డ్యాన్స్ చేస్తూ.. చెడు వ్యసనాలు బానిసలు అవుతున్నారు. అయితే రోస్ట్ అండ్ టోస్ట్ బార్ అండ్ లాంజ్ లో ఓ ఎనిమిదేళ్ల చిన్నారి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఇదేటంని ప్రశ్నిస్తూ పలువురు మంత్రులు, అధికారులకు ట్వీట్ చేశాడో వ్యక్తి.
ఎన్ని ఘటనలు జరిగినా, పోలీసులు ఎన్ని దాడులు చేసినా నగరంలో పబ్ ల యజమానులు వీ డోంట్ కేర్ అంటున్నారు. స్వయంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పబ్ ల యజమానులను పిలిచి మీటింగ్ పెట్టి మరీ హెచ్చరించినా తాము మాత్రం మారేది లేదంటున్నారు కొందరు పబ్ నిర్వాహకులు. మైనర్లకు పబ్బుల్లోకి అనుమతులు లేవని ఓ వైపు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నా.. నిర్వాహకులు మాత్రం యథేచ్ఛగా అనుమతులు ఇస్తున్నారు. మైనర్లను లోపలికి అనుమతించడమే కాదు వారు ఫ్లోర్ పై చిందులు వేస్తున్నా.. పోనీలే చిన్న పిల్లలని లైట్ తీసుకుంటున్నారు. అమ్నెషియా ఘటన తర్వాత నాలుగు రోజులు హడావుడి చేసిన అన్ని శాఖలు ఎప్పటిలాగే మిన్నకుండి పోయాయి. దీంతో పబ్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు.
వరుస ఘటనలు జరుగుతున్నా మారని పరిస్థితి..!
గతంలో గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ పబ్ లో మైనర్ డ్యాన్స్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై ఆయా శాఖల అధికారులు తెగ హడావుడి చేశారు. తర్వాత అంతా కామన్. ప్రస్తుతం మరోసారి అలాంటి ఘటననే మదీనగూడలోని మరో లాంజ్ అండ్ బార్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదీనగూడలో రోస్ట్ అండ్ టోస్ట్ పేరుతో లాంజ్ అండ్ బార్ కొనసాగుతుంది. ఇందులోకి వెళ్లేందుకు మామూలు రోజుల్లో ఎలాంటి ఫీజు లేకున్నా, వీకెండ్స్ లో మాత్రం ఒక్కో వ్యక్తికి రూ. 1000 చెల్లించి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అలా వెళ్లేందుకు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఇదే క్రమంలో ఇటీవల ఓ కుటుంబం ఫ్యామిలీతో పాటు ఈ లాంజ్ అండ్ బార్ కు వెళ్లారు.
పుష్ప సినిమా పాట రాగానే ప్లోర్ ఎక్కి డ్యాన్స్ చేసిన బాలిక
అందులో ఇద్దరు మైనర్లే ఉండడం, వారిని లోపలికి అనుమతించడం చకచకా జరిగిపోయాయి. అక్కడ పుష్ప సినిమా సాంగ్ ప్లే అవగానే అందులోని 8 ఏళ్ల చిన్నారి డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కేసి చిందులు వేసింది. దీంతో అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి మంత్రి కేటీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇతర పోలీసు అధికారులకు కూడా ట్యాగ్ చేశారు. ఇప్పుడీ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పబ్ లు, లాంజ్ ల యజమానులతో మీటింగ్ పెట్టి హెచ్చరించిన రోజే ఈ ఘటన జరగడం గమనార్హం.