Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు
Secunderabad: నిందితురాలిని గుర్తించేందుకు పోలీసులు చాలా శ్రమ పడాల్సి వచ్చింది. నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Secunderabad Railway Station Theft News: పబ్లిక్ ప్లేస్‌లో ఓ మహిళ చాకచక్యంగా చేసిన పని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పక్కనే అందరూ ఉన్నా ఏకంగా 53 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించింది. కేవలం తన చీర కొంగు అడ్డు పెట్టుకొని పని కానిచ్చింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం విషయం వెలుగులోకి వచ్చింది. నిందితురాలిని గుర్తించేందుకు పోలీసులు చాలా శ్రమ పడాల్సి వచ్చింది. నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అనూరాధ, రైల్వే డీఎస్పీ నరసయ్య, జీఆర్‌పీ సీఐ శ్రీను ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ మహిళ రైలు ఎక్కేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఆమె బ్యాగులో 53 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన మరో మహిళ ఆమెను ఫాలో అవుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆమెతోపాటే లిఫ్ట్ ఎక్కింది. ఆమెకు దగ్గరగా నిలబడి చీర కొంగు అడ్డుపెట్టి బ్యాగ్‌లో ఉన్న ఆభరణాలు కొట్టేసింది. ఈ విషయం గుర్తించడానికి పోలీసులు సుమారు 300 సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాల్సి వచ్చింది. మొత్తానికి పోలీసులు నిందితురాలిని పట్టుకొని అరెస్ట్ చేశారు.
నగరానికి చెందిన ఓ ప్రయాణికురాలు బంగారు ఆభరణాలతో 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు రాగా.. గేటు నెం.4 నుంచి ప్లాట్‌ఫాం వైపునకు వెళుతుండగా, కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీ తులసీనగర్‌కు చెందిన ఆరూరి ప్రియ (40) ఆమెను అనుసరించింది. బాధితురాలి బ్యాగు జిప్‌ను తొలగించి అందులోని బంగారు ఆభరణాలున్న బ్యాగును దొంగిలించి పారిపోయింది. బ్యాగు జిప్ తెరిచి ఉండడం గమనించిన బాధితురాలికి అందులో నగలు కనిపించలేదు. వెంటనే ఆమె రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అప్రమత్తమైన పోలీసులు స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన వీడియోలను పరిశీలించారు. బాధితురాలు లిఫ్ట్‌లో వస్తుండగా, నిందితురాలు చీర కొంగు అడ్డుపెట్టి నగల బ్యాగును కొట్టేసినట్లుగా రికార్డయింది. ఆ తర్వాత బయటకు వచ్చి ఆటోలో వెళ్లిపోయిన దృశ్యాలు కూడా పోలీసులు గుర్తించారు. నిందితురాలు కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీలో ఉంటుందని గుర్తించారు. నిందితురాలు ఇంటి వద్ద లేకపోవడంతో నిఘా పెట్టిన పోలీసులు ఈనెల 18న సికింద్రాబాద్ స్టేషన్ 4వ గేటు వద్ద ఆమె ఉన్నట్టుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
చివరికి ఆమె నుంచి రూ.6.31 లక్షల విలువ చేసే 53.1 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఆమెపై కూకట్‌పల్లి, పేట్‌బషీరాబాద్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లో దొంగతనాల కేసులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. విచారణలో నిందితురాలు నేరం అంగీకరించిందని చెప్పారు.