Cab Bookings: క్యాబ్, ఆటో డ్రైవర్లు మీ బుకింగ్ క్యాన్సిల్ చేశారా? ఈ నెంబర్‌కి ఫోన్ చేయండి: ట్రాఫిక్ పోలీసులు
క్యాబ్ డ్రైవర్లు మరింత డబ్బు డిమాండ్ చేయడం లేదా వారికి సౌకర్యవంతమైన రూట్లలో బుకింగ్స్ లేకపోతే క్యాన్సిల్ చేయడం లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఓలా, ఉబర్ క్యాబ్‌లు బుక్ చేసే సమయంలో తరచూ డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేస్తుంటారని వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు కోకొల్లలు. క్యాబ్ బుక్ అయిన తర్వాత ఎక్కడి వెళ్లాలని డ్రైవర్ ఫోన్ చేయడం, ఫలానా దగ్గరికి వెళ్లాలని కస్టమర్ చెప్పగానే అతని గిట్టుబాటు ఉంటే రావడం లేదా క్యాన్సిల్ చేయడం వంటివి డ్రైవర్లు చేస్తుంటారు. అర్జెంటుగా వెళ్లాల్సిన సందర్భాల్లో లేదా రాత్రి బాగా ఆలస్యం అయిన వేళ ఈ సమస్యలను వినియోగదారులు బాగా ఎదుర్కొంటున్నారు. ఇక ఆ పరిస్థితుల్లో మహిళలు ఉంటే మరింత ఇబ్బంది. అయినా కస్టమర్లు గతి లేని పరిస్థితుల్లో క్యాబ్ లు బుక్ చేస్తూనే ఉంటారు.
అయితే, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అర్ధరాత్రి దాటే వరకూ చాలా మంది వేడుకల్లో పాల్గొంటుంటారు. చాలా మంది మద్యం కూడా సేవిస్తుంటారు. వేడుకలు ముగిశాక ఇంటికి వెళ్లాలంటే సొంత వాహనాలు లేనివారు క్యాబ్ లు బుక్ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో క్యాబ్ బుకింగ్స్ కూడా బాగా ఉంటాయి. అదే అదనుగా క్యాబ్ డ్రైవర్లు మరింత డబ్బు డిమాండ్ చేయడం లేదా వారికి సౌకర్యవంతమైన రూట్లలో బుకింగ్స్ లేకపోతే క్యాన్సిల్ చేయడం లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అందుకని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్యాబ్ డ్రైవర్లకు హెచ్చరికలు చేశారు. ప్రయాణికులు రైడ్ బుక్ చేస్తే క్యాబ్ ఆపరేటర్లు లేదా డ్రైవర్లు క్యాన్సిల్ చేయకూడదని ఆదేశించారు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే వాహన చట్టం - 1988లోని సెక్షన్ 178 కింద ఉల్లంఘన అవుతుందని వివరించారు. అలా చేసిన డ్రైవర్‌కు ఈ - చలానా రూపంలో రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. డ్రైవర్లు ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించినా లేదా అదనపు ఛార్జీలు ఇవ్వాలని డిమాండ్ చేసినా ప్రయాణికుల వాహనం, సమయం, స్థలం తదితర వివరాలతో వినియోగదారులు 94906 17346 అనే నెంబరుకు వాట్సాప్ నంబరులో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
కొత్త సంవత్సరం వేడుకలలో ఎలాంటి అపశ్రుతి దొర్లకుండా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్లు, డ్రంకెన్ డ్రైవ్ (డీడీ) తనిఖీలను పెంచారు. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటో రిక్షాల డ్రైవర్లు సరైన యూనిఫాం, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి. శ్రీనివాస్ సూచించారు.