Hyderabad Traffic police : సలాం ట్రాఫిక్ పోలీస్ అన్న - ఆయనేం చేశారో తెలిస్తే అభినందించకుండా ఉండలేరు !
Hyderabad : వాహనదారుల్ని ఇబ్బంది పెడుతున్న ఓ రోడ్ కోసం ట్రాఫిక్ పోలీస్ కొత్త ప్రయత్నం చేశారు. బిల్డింగ్ శ్లాబ్ మెటిరీయల్ ను పోయించడమే కాకుండా స్వయంగా సాఫీగా చేశారు.
Hyderabad traffic police : హైదరబాద్ రోడ్లపై వెళ్తూంటే ఎక్కడైనా ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తే అన్ని డాక్యుమెంట్లు ఉన్నా సరే ఎందుకైనా మంచిదని దూరం దూరంగా వెళ్లిపోతూంటారు వాహనదారులు. ఏదో సాకు పెట్టుకుని ఫైన్ వేస్తారని భయం. కెమెరాలు పట్టుకుని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనిపించారంటే.. ఇంకా భయం. అది వారి డ్యూటీ. వారి పని చలాన్లు జనరేట్ చేయడమే కాదు.. ట్రాఫిక్ సాఫీగా సాగేలా చేయడం కూడా. కానీ రోడ్లు బాగు చేయడం వాళ్ల పని కాదు. ఆ రోడ్లు బాగోలేకపోతే ట్రాఫిక్ సరిగ్గా ఉండదు. వర్షాలు పడినప్పుడు .. నీళ్లు నిలబడిపోతే.. వాటిని డ్రైనేజీల్లోకి మళ్లించే బాధ్యతను కొంత మంది పోలీసులు తీసుకుంటూ ఉంటారు.
ఇలాంటి మంచి పోలీసులు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో ఎక్కువగానే ఉన్నారు. అలాంటి మరో ట్రాఫిక్ పోలీసు గురించే ఇప్పుడు మన చెప్పుకునేది. ఆయన పేరేంటో తెలియదు. లింగంపల్లి నుంచి మొహదీపట్నం వచ్చే రూట్‌లో ఆర్టీసీ డిపో దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. ఐటీ ఉద్యోగులతో పాటు నిర్మాణ రంగ కంపెనీలకు చెందిన వాహనాలు, స్కూల్ బస్సులతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. కానీ ఆ రోడ్డు మాత్రం సగం కోసుకుపోయి ఉంటుంది. ట్రాఫిక్ ఆగిపోయినప్పుడు కొంత మంది కింద పడుతూ ఉంటారు.
ఈ సమస్య చాలా కాలంగా ఉంది. అక్కడ విధులు నిర్వహించే పోలీసులకు కూడా వాహనదారులు ఇలా ఇబ్బంది పడటం సమస్యగా అనిపించింది. అయితే దాన్ని ప్రభుత్వం స్థాయిలో పరిష్కరించాలంటే సాధ్యమయ్యే పని కాదు. వారి విధి నిర్వహణలోనే తీరిక లేకుండా ఉంటారు.. ఇక ఆ సమస్యను ఫాలో అప్ చేయడం అంత తేలిక కాదు. అందుకే ఆ పోలీసులు కొత్తగా ఆలోచించారు. నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లకు శ్లాబ్ మిక్సింగ్ తీసుకెళ్లే లారీల వాళ్లతో మాట్లాడారు. మిగిలిపోయినది ఉంటే... ఈ సారి రోడ్ పక్కన తాము చెప్పిన దగ్గర పోయాలని సూచించారు. ఇలా శుక్రవారం రోజున ఓ లారీలో కొంత మెటీరియల్ మిగిలిపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విధుల్లో ఉన్నట్రాఫిక్ పోలీసు రోడ్డు పాడైపోయిన దగ్గర పోయించారు.
మామూలుగా అయితే కుప్పలాగా పడిపోతుంది. అలా ఉంటే.. అసలుకే సమస్య వస్తుంది. దాన్ని రోడ్డుకు సమానంగా పరచాలి. ఆ బాధ్యతను కూడా ట్రాఫిక్ పోలీసే తీసుకున్నాడు. షూస్ పక్కన పెట్టి పార తీసుకుని ప్యాంట్ పైకి లాగేసుకుని రంగంలోకి దిగిపోయారు. రోడ్ ను సాఫీగా చేసేశారు. మాములుగా అయితే ఆ పోలీసుకు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ రోజూ అక్కడ వాహనదారులు పడుతున్న ఇబ్బంది చూసి.. వెంటనే పరిష్కరానికి తన వంతు ప్రయత్నం చేశారు. ఇలా ఏబీపీ దేశం ప్రతినిధి ఆ దారిలో వెళ్తూ.. సిగ్నల్ పడినప్పుడు పని చేస్తున్న కానిస్టేబుల్ వీడియో తీశాడు. ఆయన ఎవరో.. కనుక్కునే అవకాశం రాలేదు. వెంటనే గ్రీన్ సిగ్నల్ పడింది.
ఆ ట్రాఫిక్ పోలీస్ ఎవరైనా కావొచ్చు కానీ.. ఆ స్ఫూర్తి మాత్రం.. ఖచ్చితంగా వాహనదారులుక మేలు చేస్తుంది. అలాంటి వారిని ప్రోత్సహిస్తే మరింత మందికి స్ఫూర్తి లభిస్తుంది