(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad News: మీ వెహికిల్ ఇక్కడ పార్క్ చేశారో ఇక అంతే! Hyd లో ట్రాఫిక్ సమస్యకు కొత్త స్ట్రాటజీ
సాధారణ జనాల్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న ఈ ట్రాఫిక్ సమస్యపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ సమస్య పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లుగా సీపీ చెప్పారు.
హైదరాబాద్ నగరంలో రోడ్లపై వాహనాల రద్దీ రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. ఫలితంగా రోడ్లపైన ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. అంతకుముందు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడే వారు కూడా కొవిడ్ తర్వాత సొంత వాహనాలను అలవాటు పడ్డారు. దిగువ మధ్య తరగతి కూడా తంటాలు పడి సొంత వాహనం కొనుక్కున్న వారూ ఉన్నారు. దీంతో ప్రస్తుతం నగరంలో రోజు దాదాపు 77.5 లక్షల వాహనాలు తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల లెక్కలో తేలింది. 2019తో పోలిస్తే ఏకంగా 18 శాతం పెరిగాయి. బైక్ లే అత్యధికంగా దాదాపు 56 లక్షల వరకు ఉన్నాయి. మరో 14 లక్షల కార్లు ఉన్నాయని పోలీసుల అధ్యయనంలో తేలింది.
అయితే, సాధారణ జనాల్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న ఈ ట్రాఫిక్ సమస్యపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ సమస్య పరిష్కరించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లుగా చెప్పారు. బంజారాహిల్స్‌లోని కొత్త కమిషనరేట్‌లో ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ సహా ఇతర అధికారులతో కలిని ట్రాఫిక్ పోలీసుల కొత్త లోగోను ఆవిష్కరించారు. భవిష్యత్తు కోసం రూపొందించిన ట్రాఫిక్ పోలీసుల యాక్షన్ ప్లాన్‌పై కూడా వివరించారు.
క్యారేజ్ వే కోసం ‘రోప్’
రోడ్లపై ట్రాఫిక్ సాఫీగా కదులుతూ ఉండాలంటే మెయిన్ ప్రధాన రహదారికి మధ్య ఉండే క్యారేజ్ వే క్లియర్‌గా ఉండాలి. ప్రస్తుతం చాలా చోట్ల నో పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు నిలపడం, ఆ క్యారేజ్ వేను ఆక్రమించడంతో అది కనపడట్లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆపరేషన్ రోప్ (రివూవల్ ఆఫ్ అబ్‌స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్‌కరోజ్‌మెంట్స్) చేపడతామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇందులో భాగంగా క్రేన్ వాహనాలతో టోవింగ్ చేయడంతో పాటు అక్రమ పార్కింగ్ చేసిన వాహనాలకు క్లాంప్స్ వేస్తామని హెచ్చరించారు. వాహన చోదకుడికి ఇబ్బంది లేకుండా వాటిపై స్థానిక అధికారుల ఫోన్ నంబర్లు ఉంచుతామని అన్నారు. తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల ఆక్రమణలనూ పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అపార్ట్‌మెంట్స్ సహా ప్రతి భవనానికీ పార్కింగ్ ఉండేలా చూస్తామని అన్నారు.
ఆర్టీసీ బస్ బేలను తిరిగి వినియోగంలోకి తేస్తామని అన్నారు. ప్రస్తుతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయం పీక్ అవర్‌గా మారుతోంది. ఆయా వేళల్లో అన్ని స్థాయిల అధికారులూ రోడ్లపైనే ఉంటారని, ట్రాఫిక్ పర్యవేక్షణకే తాము ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనల వారీగా ప్రతి వారం ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్స్ చేపడతామని అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో టెక్నాలజీ వినియోగిస్తాం. స్టాప్ లైన్ వద్ద డిసిప్లిన్ కనిపిస్తే ఇతర ఉల్లంఘనలు తగ్గుతాయని గుర్తించడంతో దీనిపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు వీలున్న ప్రతి జంక్షన్‌లో ఫ్రీ లెఫ్ట్ విధానం అమలు చేస్తామని అన్నారు. రద్దీ వేళల్లో అవసరమైన మార్గాలను రివర్సబుల్ లైన్‌లుగా మారుస్తామని చెప్పారు.
100కి ఎక్కువ కాల్స్ ట్రాఫిక్ గురించే
ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డయల్ 100కు వస్తున్న ఫోన్లలో 80 శాతం వరకు ట్రాఫిక్ సమస్యల గురించే ఉంటున్నాయి. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిబ్బందిని నియమించనున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. మహానగరంలోని పలు కూడళ్ల వద్ద ఆటోమెటిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటుచేశామని, అందులోని సాంకేతిక ఇబ్బందులు గమనించి రానున్నరోజుల్లో నగరంలోని అన్ని కూడళ్లలో ఆటోమెటిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ అమలుచేస్తామని సీపీ చెప్పారు.