Revanth Reddy Padayatra : రేవంత్ రెడ్డి పాదయాత్రకు అదనపు భద్రత, హైకోర్టు ఏమందంటే?
Revanth Reddy Padayatra : రేవంత్ రెడ్డి పాదయాత్రకు అదనపు భద్రత కోరుతూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. ప్రభుత్వం చెబుతున్న భద్రత కల్పిస్తున్నారో లేదో చెప్పాలని పిటిషనర్ ను ఆదేశించింది.
Revanth Reddy Padayatra :టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తాను చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో అభియాన్ పాదయాత్రకు భద్రత పెంచాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ యాత్ర జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే భద్రత కల్పిస్తున్నట్టు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపింది. పాదయాత్ర సందర్భంగా భద్రత కల్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశించినట్టు ప్రభుత్వ న్యాయవాది(జీపీ) తెలిపారు. భద్రత కల్పించాలని ఆదేశించిన ఫ్యాక్స్ కాపీని కోర్టుకు సమర్పించారు. డీజీపీ ఆదేశాలకు అనుగుణంగా భద్రత ఇస్తున్నారో లేదో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అయితే వాదనలు విన్న న్యాయస్థానం పాదయాత్రకు భద్రత కల్పిస్తే విచారణ కొనసాగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. ప్రభుత్వం చెబుతున్న భద్రత ఉందో? లేదో? సోమవారం కోర్టుకు తెలపాలని రేవంత్ తరఫు న్యాయవాదికి సూచించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణ మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.
భూపాలపల్లిలో రేవంత్ పై కోడి గుడ్ల దాడి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఇటీవల వరంగల్ జిల్లా భూపాలపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలు టమాటాలు, గుడ్లు విసిరారు. రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా రేవంత్ రెడ్డి వైపు దూసుకొచ్చారు. కాంగ్రెస్ సభవైపు రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని దగ్గర్లోని థియేటర్ లో బంధించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్న థియేటర్ పై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఉద్రిక్తతల మధ్య రేవంత్ రెడ్డి ప్రసంగం ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎదురవుతున్నాయని, తన పాదయాత్రకు సరైన భద్రత కల్పించడంలేదని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తన పాదయాత్రకు భద్రత పెంచాలని హైకోర్టును ఆశ్రయించారు.
ఫ్లెక్సీల వివాదం
భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీల మధ్య ఇటీవల ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీల ఘర్షణ ముదిరింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై మరొకరు దాడికి దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేసి గొడవను సద్దుమణిగేలా చేశారు. భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు కడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేటీఆర్ పర్యటన ముగిసినా ప్లెక్సీలు ఎందుకని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రేవంత్ రెడ్డి కటౌట్ కట్టకుండా అడ్డుకోవడంతో అంబేద్కర్ కూడలిలో కాంగ్రెస్ కార్యకర్త టవర్ ఎక్కాడు. దీంతో గొడవ మరింత ముదిరింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. మొత్తానికి పోలీసులకు లాఠీచార్జ్ చేశారు.