(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad: నెక్లెస్‌రోడ్ స్టేషన్‌లో రైల్ కోచ్ రెస్టారెంట్, చూస్తే వావ్ అనాల్సిందే
Hyderabad: నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ లో కొత్తగా రైల్ కోచ్ రెస్టారెంట్ ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది.
Hyderabad: పాత రైల్ కోచ్‌లను క్రియేటివ్ గా వాడేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికులకు మంచి అనుభూతిని అందించే ఉద్దేశంలో భాగంగా రైల్ కోచ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తున్న దక్షిణ మధ్య రైల్వే.. అందులో భాగంగా మరో రెస్టారెంట్ ను ప్రారంభించింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ లో కొత్తగా రైల్ కోచ్ రెస్టారెంట్ ను ప్రారంభించింది ఎస్‌సీఆర్. ఈ రెస్టారెంట్ బయటికి రైల్ కోచ్ లాగే ఉంటుంది. లోపలికి వెళ్తే అదిరిపోయే ఇంటీరియర్ తో రెస్టారెంట్ మాదిరిగా ఆకట్టుకుంటుంది. ఇటీవలె కాచిగూడ స్టేషన్ లో రైల్ కోచ్ రెస్టారెంట్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన రైల్ కోచ్ రెస్టారెంట్ రెండోది.
నెక్లెస్ రోడ్డులోని రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు, పర్యాటకుల రద్దీ రోజూ ఉంటుంది. నెక్లెస్ రోడ్డు, పీపుల్స్ ప్లాజా, ట్యాంక్ బండ్, దగ్గర్లోనే నీరా కేఫ్ సహా ఇతర పర్యాటక ప్రదేశాలు, సేదతీరేందుకు మంచి చోటు కావడంతో.. ఇక్కడ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఉపయోగంలో లేని రైల్ కోచ్ ను లోపల మొత్తం రెస్టారెంట్ మాదిరిగా మార్చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. మంచి స్టార్ రెస్టారెంట్ ఫీల్ అందించేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ ను ఐదేళ్ల పాటు బూమ్‌రాంగ్ రెస్టారెంట్ నిర్వహిస్తుంది. రైల్వే ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలకు కూడా రెస్టారెంట్ అందుబాటులో ఉంటుంది.
ఇటీవలె కాచిగూడ రైల్వే స్టేషన్‌లో రెస్టారెంట్
దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాచీగూడ రైల్వే స్టేషన్లో రైల్వే కోచ్ రెస్టారెంటును ఏర్పాటు చేశారు. దీని పేరు పరివార్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్. నార్త్ ఇండియన్, సౌతిండియన్, మొఘలాయి, చైనీస్ వంటి రుచికరమైన ఆహార పదార్థాలను పరివార్ ఫుడ్ ఎక్స్‌ప్రెస్‌లో అందిస్తున్నారు. కాచీగూడ రైల్వేస్టేషన్ నిత్యం ప్రయాణికులతో అలరారుతుంది. ఎంతో మంది రైలు దిగగానే తినడానికి ప్రయత్నిస్తారు. దాంతో సర్క్యూలేటింగ్ ఏరియాలో హైదరాబాద్ డివిజన్లో మొదటి రెస్టారెంట్ ఆన్ వీల్స్‌ను అధికారులు ఆరంభించారు. రెండు పాత హెరిటేజ్ కోచులను ఇందుకు ఉపయోగించుకున్నారు. వాటిని పునరుద్ధరించి, నగిషీలు అద్ది అత్యంత రాజసంగా మార్చేశారు. ప్రయాణికులతో పాటు సాధారణ ప్రజలూ ఇక్కడ ఫుడ్‌ను ఆస్వాదించొచ్చు.
రైలు పట్టాలపై అమర్చిన కోచుల్లో డైనింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం వల్ల కస్టమర్లకు ప్రత్యేక డైనింగ్ అనుభూతి వస్తుందని అధికారులు అంటున్నారు. ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన ఆహార క్షేత్రంగా ఉంటుందని సూచిస్తున్నారు. త్వరలోనే మరిన్ని సౌకర్యాలు నెలకొల్పుతామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ అన్నారు. మంచి ఐడియాతో రెస్టారెంటును నిర్మించిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. 24 గంటలు ప్రయాణికులు, కస్టమర్లకు నాణ్యతతో కూడిన ఆహారం, పానీయాలను అందిస్తున్నామని వెల్లడించారు.
ప్రస్తుతం థీమ్ బేస్ రెస్టారెంట్లు ట్రెండ్‌గా మారాయి! కస్టమర్లు తమ ఇష్టాలకు తగ్గట్టుగా ఇందులోకి వెళ్లి ఆహారాన్ని ఆస్వాదించవచ్చు. ఉదాహరణకు ట్రైన్ రెస్టారెంట్లు పిల్లలను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. రోబో రెస్టారెంట్లలో రోబోలే వడ్డిస్తాయి. ఈ కోవలోకే వస్తుంది రైల్ కోచ్ రెస్టారెంట్.