Press Club of Hyderabad Takes Charge: బాధ్యతలు చేపట్టిన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ కార్యవర్గం.. కొత్త టీమ్ సభ్యులు వీరే
Press Club of Hyderabad Takes Charge: హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌కు ఈనెల 13న ఎన్నికలు జరగగా, శనివారం నాడు నూతన కార్యవర్గం బాధ్యతలు చేపట్టింది.
Hyderabad Press Club New Team Takes Charge: హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం శనివారం నాడు బాధ్యతలు చేపట్టింది. ఈనెల 13న ప్రెస్‌క్లబ్ ఎన్నికలు నిర్వహించి, అదే రోజు రాత్రి ఫలితాలు ప్రకటించారు. ఎన్నికల రిట్నర్నింగ్ అధికారి హేమసుందర్ గుండె సంబంధ వ్యాధితో ఆస్పత్రిలో చేరగా, ఎన్నికల ప్రక్రియను మరో రిటర్నింగ్ అధికారి రంగాచార్యులు ఆధ్వర్యంలో చేపట్టి ముగించారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షులుగా వేణుగోపాల నాయుడు బాధ్యతలు స్వీకరించారు.
ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం బాధ్యతలు..
అధ్యక్షుడు వేణుగోపాల నాయుడుతో పాటు, ప్లెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా రవికాంత్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా సి.వనజ, కె.శ్రీకాంత్ రావు, సహాయ కార్యదర్శులుగా రమేష్ వైట్ల, చిలుకూరి హరిప్రసాద్, కోశాధికారిగా ఎ.రాజేష్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యవర్గ సభ్యులుగా ఏ.పద్మావతి, బ్రహ్మండభేరి గోపరాజు, మర్యాద రమాదేవి, N. ఉమాదేవి, కస్తూరి శ్రీనివాస్, వి. బాపురావు, ఎం. రాఘవేందర్ రెడ్డి , పి. అనిల్ కుమార్. , శ్రీనివాస్ తిగుళ్ళ, జి.వసంత్ కుమార్ శనివారం నాడు బాధ్యతలు చేపట్టారు.
మరో ప్యానల్ ఆరోపణలు..
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ కొత్త టీమ్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టినట్లు నూతన అధ్యక్షుడు వేణుగోపాల నాయుడు, ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరో ప్యానల్ మాత్రం ఈ ఫలితాలను అంగీకరించడం లేదు. ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో రెండు గుర్తులపై అధ్యక్ష అభ్యర్థి సూరజ్ భరద్వాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త టీమ్ బాధ్యతలు చేపట్టడం కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని, ప్రెస్ క్లబ్ తాజా ఎన్నిక చెల్లదని ఆరోపించారు. మరోవైపు ఎలక్షన్ రోజు రాత్రి కౌంటింగ్ జరుగుతుంటే జై తెలంగాణ నినాదాలు సైతం చేయడం.. అది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వరకు వెళ్లడం ఎన్నికల తీవ్రతను స్పష్టం చేస్తుంది.
వివాదంగా ప్రెస్‌క్లబ్ ఎలక్షన్, ఫలితాలు..
మార్చి 13న జరిగిన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఎన్నికలు వివాదానికి దారితీశాయి. బ్యాలెట్ పేపర్ల విషయంలో ఓ ప్యానల్ అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. వాటిని పోలీసుల పర్యవేక్షణలో ఉంచారు. వివాదం కోర్టుకు సైతం చేరడంతో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రశాంతంగా జరగాల్సిన హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఈ ఏడాది వివాదాలతో ముగిశాయి. 80 ఓట్ల తేడాతో ఓటమి పాలైన తర్వాత తమను బెదిరించి, పత్రాలను లాక్కొని బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు పోశారని సూరజ్ భరద్వాజపై రిటర్నింగ్ అధికారులు హేమసుందర్ రావు, రంగాచార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.