Hyderabad: రాంగ్ రూట్‌లో వెళ్తే జైలుకే- కెమెరాలతో నిఘా- కఠిన చర్యలకు సిద్ధమైన హైదరాబాద్ పోలీసులు
Hyderabad Police: చిన్న చిన్న తప్పుల కారణంగా జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు హైదరాబాద్ పోలీసులు సిద్ధమయ్యారు. అందులో ముఖ్యమైన రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై ఫోకస్ పెట్టారు.
Telangana News: హైదరాబాద్‌లో ఎంత కఠినంగా ట్రాఫిక్ రూల్స్ అమలు చేస్తున్నా రోజూ ఏదో చోట ప్రమాదం జరుగుతూనే ఉంది. సక్రమంగా వెళ్లే వారితో ఎలాంటి సమస్యలు ఉండటం లేదు. కానీ తక్కువ దూరమే కదా అని రాంగ్ రూట్‌లో వెళ్లేవారితో, నిమిషాలు కూడా సిగ్నల్ వద్ద ఆగలేని వారితోనే సమస్య వచ్చి పడుతోంది. ఇలాంటి వారిని నియంత్రించేందుకు చట్టానికి మరింత పదును పెడుతున్నారు హైదరాబాద్ పోలీసులు.
కొందరికి యూ టర్న్ వరకు వెళ్లడానికి కొందరు ఇష్టపెట్టుకోరు. కొద్ది దూరమే కదా అని రాంగ్ రూట్‌లో వెళ్తుంటారు. అలాంటి వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఇలాంటి వారితో జరిగే ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అందుకే వీరిని నియంత్రించేందుకు పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇకపై యూ టర్న్ తీసుకోకుండా రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు.
రాంగ్ రూట్‌లో వెళ్తూ ప్రమాదానికి కారణమైతే ఎఫ్‌ఐర్ నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరిచే ప్రక్రియ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మే నుంచే అమల్లో ఉంది. దీన్ని మిగతా కమిషనరేట్ పరిధిలో కూడా అమలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. సైబరాబాద్ పరిధిలో నెలరోజుల్లోనే రెండు వందల మందికిపైగా వాహనదారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. అంటే ఎంత మంది ఇలా రాంగ్ రూట్‌లో వెళ్తున్నారో అర్థమవుతుందని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: తెలంగాణలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ ల తయారీ కేంద్రం, కార్నింగ్ కంపెనీతో సీఎం రేవంత్ ఒప్పందం
ర్యాష్ డ్రైవింగ్, డ్రంకన్ అండ్ డ్రైవ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. వీటి కారణంగానే మూడు కమిషనరేట్ పరిధిలో రోజూ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ఒకరిద్దరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.
మూడు కమిషనరేట్ పరిధిలో బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపడితే భారీగా వాహనదారులు పట్టుబడ్డారు. ఇందులో దాదాపు ఏడు వందల మంది వరకు రాంగ్ రూట్‌లో వస్తూ పోలీసులకు చిక్కారు. వీరిలో టూ వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఇలాంటి వారి వల్లే ఈ ఏడాది ఇప్పటి వరకు వందల ప్రమాదాలు జరిగాయని అందులో వందమందికిపైగా గాయపడగా.. ఒకరు చనిపోయినట్టు పోలీసులు రికార్డులు చెబుతున్నాయి.
ఇలా రాంగ్ సైడ్ డ్రైవింగ్‌తో ప్రజల ప్రాణాలు హరిస్తున్న వారిని గుర్తించేందుకు పోలీసులు సడెన్‌గా డ్రైవ్‌లు చేపట్టడంతోపాటు చాలా ప్రాంతాల్లో ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న దాదాపు 125 ప్రాంతాల్లో అత్యాధునిక కెమెరాలతో నిఘా పెట్టారు. వీటి ఫుటేజ్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే కచ్చితంగా వారిపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేస్తామని హెచ్చరిస్తున్నారు.
Also Read: విద్యార్ధులకు గుడ్ న్యూస్, ఆ ఒక్కరోజు కలిపితే వచ్చేవారంలో వరుసగా 5 రోజుల సెలవులు