Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ సరఫరాలో కింగ్ పిన్ అరెస్టు - లక్ష్మీపతిని అదుపులోకి తీసుకున్న నార్కోటిక్ వింగ్
డ్రగ్స్ తీసుకొని మృతి చెందిన విద్యార్థి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కీలక సూత్రధారిని అరెస్టు చేశారు.
హైదరాబాద్‌లో బీటెక్ విద్యార్థి మృతి కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
గతవారం డ్రగ్స్ అధిక మోతాదులో తీసుకొని ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఆ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో లక్ష్మీపతి అనే వ్యక్తిని ఇవాళ అరెస్టు చేశారు.
విశాఖ నుంచి హాష్ అయి తీసుకొచ్చి హైదరాబాద్‌లో సరఫరా చేయడంలో లక్ష్మీపతి చాలా కీలక వ్యక్తి. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు విద్యార్థులకు, ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు.
లక్ష్మీపతి ఓ పోలీసు అధికారి కుమారుడు. బీటెక్ మధ్యలోనే మానేసి చెడు వ్యసనాలకు బానిసై వక్రమార్గం పట్టాడు. మొదట్లో గంజాయి అమ్మేవాడు. పోలీసుల నిఘా పెరగడంతో తరచూ నివాసించే స్థలం మారుస్తూ వారి నుంచి తప్పించుకునేవాడు. క్రమంగా గంజాయి నుంచి హాష్ ఆయిల్‌కు మారాడు. విశాఖ నుంచి మాల్ తీసుకొచ్చి.. హైదరాబాద్ సిటీ శివారులో దిగిపోయి అక్కడి నుంచి స్నేహితుల సాయంతో నగరంలోకి వచ్చేవాడు.
పదుల సంఖ్యలో ఏజెంట్లను పెట్టుకొని డ్రగ్స్ అమ్మకాలు సాగించేవాడు లక్ష్మీపతి. లక్ష రూపాయలకు సరకు తీసుకొచ్చి మూడు నుంచి ఐదు లక్షల రూపాయలకు అమ్మేవాడు.
లక్ష్మీపతి సరఫరా చేసిన డ్రగ్ కారణంగానే విద్యార్థి బలైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొదట ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతనితోపాటు మరో ముగ్గురు వినియోగదారులను కూడా అరెస్టు చేశారు. విచారణ అనంతరం వీళ్లు ఇచ్చిన సమాచారంతో లక్ష్మీపతి కోసం వేటా కొనసాగించారు. ఎట్టకేలకు వారం తర్వాత లక్ష్మీపతిని అరెస్టు చేశారు.
లక్ష్మీపతిని అరెస్టు చేసిన తర్వాత ఆయన సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అందులో వందల మంది విద్యార్థుల నెంబర్లు ఉన్నట్టు గుర్తించారు. కొన్ని పబ్‌లకు సంబంధించిన సమాచారం కూడా ఉందని తెలుస్తోంది.
మొన్న మృతి చెందిన విద్యార్థి గోవా వెళ్లి డ్రగ్స్ తీసుకునే వాడని... గతంలో కూడా ఓసారి అతన్ని పట్టుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు.