Hyderabad News: జల్సా కోసం పోలీసులకు, తండ్రికి చుక్కలు చూపించిన సుపుత్రుడు, అసలేం జరిగిందంటే?
Hyderabad News: స్నేహితుడితో కలిసి మందు పార్టీ చేసుకుంటూ.. జల్సాకోసం పోలీసులు, కన్న తండ్రికి చుక్కలు చూపించాడో యువకుడు.
Hyderabad News: మద్యం సేవిస్తూ జల్సా చేయటం కోసం పోలీసులను, కన్న తండ్రిని బురిడీ కొట్టించాడో సుపుత్రుడు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాడు. రెండు గంటల పాటు తండ్రితో సహాపోలీసులు కూడా అతగాడి కోసం విపరీతంగా గాలించారు.
షేక్ పేటకు చెందిన షోయబ్.. నాలుగు రోజుల క్రితం స్నేహితుడితో గొడవ అయిందంటూ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఆదివారం వరకు షోయబ్ ఇంటికి రాకపోవటంతో కుటుంబ సభ్యులంతా తీవ్రంగా కంగారుపడ్డారు. అది చాలదన్నట్లు షోయబ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో మరింత టెన్షన్ పడ్డారు. ఈక్రమంలోనే షోయబ్ తండ్రి 100కు డయల్ ఫోన్ చేసి తన కుమారుడు కిడ్నాప్ కు గురైయ్యాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగు రోజుల క్రితం షోయబ్ ఫోన్ చేసి.. అతని స్నేహితుడు హమీద్ తో గొడవ పడినట్లు చెప్పాడని.. తనకు అతడిపైనే అనుమానం ఉందని వివరించాడు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో సిగ్నల్ ఆధారంగా రెండు గంటల పాటు శ్రమించి నగర శివారు ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు.
వెంటనే అక్కడకు వెళ్లి చూడగా షోయబ్, హమీద్ మద్యం తాగుతూ జల్సా చేయడం చూసి పోలీసులు, తండ్రి ఆశ్చర్యపోయారు. మందుగా గొడవ పడ్డ తాము.. తిరిగి కలిసినందుకు మద్యం పార్టీ చేసుకున్నట్టు బాధితులు పోలీసులకు వివరించారు. తండ్రితో పాటు తమను కూడా ఉరుకులూ పరుగులు పెట్టించిన షోయబ్ ను పోలీసులు అతని తండ్రికి అప్పగించారు.