Hyderabad: పాములు వస్తున్నాయంటే పట్టించుకోరా? ఇప్పుడు మీ ఆఫీస్‌లో ఉంది ఏం చేస్తారు? అధికారులను పరుగులు పెట్టించిన వ్యక్తి
Hyderabad: ఇంట్లోకి పాము వచ్చిందని ఫిర్యాదు చేస్తే జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదని ఓ వ్యక్తి ఆఫీసుకు పామును తీసుకొచ్చాడు.
Hyderabad: హైదరాబాద్ లో ఎడతెరిపిలేని వర్షాలతో జనాలు ఆగమైపోతున్నారు. చాలా ప్రాంతాల్లో నీరు చేరి రోడ్లు కూడా నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో మోకాలు లోతు నీరు చేరి ఇబ్బంది పడుతున్నారు హైదరాబాదీలు. ఈ వర్షాలతో పాటు బురద, చెత్తా చెదారం, వ్యర్థాలు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. వీటితో పాటు క్రిమికీటకాలు, పాములు కూడా వస్తూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. హైదరాబాద్ శివారు అల్వాల్ ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తి ఇంట్లోకి వాన నీటితో పాటు పాము కూడా వచ్చింది. దీంతో సంపత్ కుమార్ అనే యువకుడు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు. ఇలా ఇంట్లోకి పాములు వస్తుంటే చాలా భయంగా ఉందని అధికారులు తమకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
అయితే సంపత్ ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా... జీహెచ్ఎంసీ అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఓ వైపు వర్షాలు, మోకాలి లోతు నీళ్లు, మరోవైపు ఇంట్లోకి వస్తున్న పాములు, క్రిములు.. దీంతో సంపత్ కుమార్ తీవ్ర ఆవేశానికి గురయ్యాడు. అధికారుల తీరుపై అసహనంతో సంపత్ కుమార్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులను జడుసుకునేలా చేసింది. సంపత్ ఏం చేశాడంటే..
ఇంట్లోకి వస్తున్న పాముల్లో ఒక దానిని ఎలాగోలా సాహసం చేసి పట్టుకున్నాడు. దానిని అలాగే పట్టుకుని స్థానిక జీహెచ్ఎంసీ ఆఫీసుకు తీసుకెళ్లాడు. ఓ అధికారి టేబుల్ మీద ఆ పామును వదిలిపెట్టాడు. సంపత్ కుమార్ చేసిన పనికి జీహెచ్ఎంసీ అధికారులు భయాందోళనకు గురయ్యారు.
వరద నీరు వచ్చి ఇంట్లోకి పాములు కూడా వస్తుంటే భయపడి హెల్ప్ లైన్ కు ఫోన్ చేస్తే పట్టించుకోకపోవడంపై సంపత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలుస్తోందని సంపత్ మండిపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్
హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మొత్తం ఆరు జోన్‌లు - చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. జులై 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణాలో నిజామాబాద్‌లో అత్యధికంగా 464 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో చార్మినార్‌లో 79 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) నివేదించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. తమ ప్రయాణాలను పక్కాగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచి నగరం అంతటా తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న రోడ్డుతోపాటు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమైన సందర్భాలు ఉన్నాయి. దీనిపై చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తమ ఆవేదన, అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం ఐటీతో పాటు ట్రాఫిక్‌లోనూ బెంగళూరుతో పోటీ పడుతోందని విమర్శించారు. కేవలం గంటసేపు కురిసిన వర్షంతో రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. గంట సేపు వర్షం కురిస్తే భాగ్యనగరం పరిస్థితి ఇదీ అంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్ ట్రాఫిక్‌లను పోలుస్తూ.. త్వరలో హైదరాబాద్ బెంగళూరును దాటేస్తుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.