Hyderabad News: కేసు పెట్టిందనే కక్షతో వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారం
Hyderabad News: ప్రజలను కాపాడాల్సిన వృత్తిలో ఉండి తానే వివాహితపై అత్యాచారం చేశాడో కానిస్టేబుల్. వేధిస్తున్నందుకు కేసు పెట్టిందనే కక్షతో ఆమెపై పలుమార్లు దురాగతానికి పాల్పడ్డాడు.
Hyderabad News: హైదరాబాదులో దారుణం జరిగింది. ఓ వివాహితపై కానిస్టేబుల్ పలుమార్లు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తనపైన ఉన్న పాత కేసును ఉపసంహరించుకోవాలంటే అతను బాధితురాలిపై పదేపదే దారుణానికి ఒడిగట్టాడు. ఆమె నగ్న చిత్రాలు, వీడియోలు సేకరించి బెదిరింపులకు దిగాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.
మీర్‌పేట పరిధిలో ఉంటున్న ఓ వివాహిత కుటుంబం గతంలో సైదాబాద్‌లో నివసించేది. మాదన్నపేట ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పి.వెంకటేశ్వర్లు (30) వారి ఇంటి సమీపంలోనే ఉండేవాడు. బాధిత వివాహిత, కానిస్టేబుల్ భార్య ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె అతణ్ని తిరస్కరించడంతో వేధించడం మొదలుపెట్టాడు. దాంతో బాధితురాలు సైదాబాద్ ఠాణాలో 2021 జనవరిలో ఫిర్యాదు చేయగా పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు.
అయినా ఆగని వేధింపులు
అయినప్పటికీ నిందితుడు ఆమెను మరింతగా వేధించడం మొదలుపెట్టాడు. చాలాసార్లు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బాధితురాలు మరోసారి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా 2021 మే నెలలో వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బాధితురాలు కుటుంబంతో సహా సికింద్రాబాద్‌కు మారారు. అనంతరం మీర్‌పేటకు వచ్చారు. ఫోన్ నంబరు మార్చినా నిందితుడి నుంచి వేధింపులు ఆగలేదు.
కక్ష పెంచుకొని అత్యాచారం
జైలు నుంచి విడుదలైన కానిస్టేబుల్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. బాధితురాలి చిరునామా తెలుసుకున్నాడు. భర్త లేని సమయం చూసి ఆగస్టు 18న ఆమె ఇంటికి వెళ్లాడు. తనకు సహకరించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత తరచూ ఇంటికెళ్లి దారుణానికి పాల్పడేవాడు. ఆమె నగ్న ఫొటోలు, వీడియోలు సేకరించి ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించేవాడు. ఈ నెల 14న మధ్యాహ్నం ఆమె ఇంటికెళ్లి తనపై గతంలో పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశాడు. వినకపోవడంతో దాడికి దిగాడు. మరోసారి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా బాధితురాలు కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదేరోజు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేపట్టారు.
అనంతపురంలో యువతి ఆత్మహత్య
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన 20 ఏళ్ల మేఘలత జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన 24 ఏళ్ల శివ కుమార్ ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె తిరస్కరించింది. ఆ విషయం ఇంట్లో తెలియడంతో మేఘలతకు పెళ్లి సంబంధం కుదిర్చారు. ఈనెల 6వ తేదీన శివకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మేఘలత మానసిక క్షోభకు గురైన ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అంతే కాకుండా చనిపోవడానికి ముందు సూసైడ్ నోట్ కూడా రాసింది.
సూసైడ్ నోట్ లో ఏముందంటే..?
"నాన్నా.. నేను నీ కూతురిని. ప్రాణం పోయినా తప్పు చేయను. 2019లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టిన వారిని వదలకు. అమ్మను, చెల్లిని, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో." అంటూ తండ్రికి లేఖ రాసింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.