Minister Niranjan Reddy : వ్యవసాయరంగం దయనీయ స్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణం, రాహుల్ గాంధీకి మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ
Minister Niranjan Reddy : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. ముందు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బహిరంగ లేఖరాశారు.
![Minister Niranjan Reddy : వ్యవసాయరంగం దయనీయ స్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణం, రాహుల్ గాంధీకి మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ Hyderabad Minister niranjan reddy open letter to congress rahul gandhi telangana tour Minister Niranjan Reddy : వ్యవసాయరంగం దయనీయ స్థితికి కాంగ్రెస్ పార్టీయే కారణం, రాహుల్ గాంధీకి మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/05/0bf87ee488da2b5f2dcf912d91689a04_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Minister Niranjan Reddy : తెలంగాణ పర్యటనకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాల నాటి కాంగ్రెస్ పార్టీ పాలన పాప ఫలితమే వ్యవసాయరంగం దయనీయస్థితిలో ఉండడానికి కారణమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంతులేని వైఫల్యాల చరిత్రను ఒక్క లేఖలోనో ఒక్క మాటలోనో చెప్పడం సాధ్యంకాదన్నారు. యూపీఏ పదేండ్ల పాలనలో ఎక్కడచూసినా రైతన్నల మరణవార్తలే వినిపించాయన్నారు. NCRB లెక్కల ప్రకారమే 1,58,117 మంది రైతులు అప్పుల పాలై, ఆత్మహత్యలు చేసుకున్న విషయం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు పదేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో రైతాంగానికి ఒరిగింది శూన్యం అని విమర్శించారు. పండించిన పంటను కొనమని, బకాయిలు అడిగిన ఎర్రజొన్న రైతులను కాల్చి చంపిన కర్కశ పాలన కాంగ్రెస్ పార్టీదని నిరంజన్ రెడ్డి విమర్శించారు.
రైతులపై తుపాకీ తూటాలు పేల్చిన కాంగ్రెస్
నాడు రైతులపైన తుపాకీ తూటాలు పేల్చిన కాంగ్రెస్ ఇవాళ రైతు సభలు పెడుతున్నారని మంత్రి సింగిరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ భూములు పంచాలని, పేదలకు ఇంటి జాగాలు పంచాలని డిమాండ్ చేస్తూ జరిగిన ముదిగొండ ధర్నా మీద కాల్పులు జరిపి ఏడుగురి ప్రాణాలు బలిగొన్నది కాంగ్రెస్ పార్టీ కాదా అని మంత్రి ప్రశ్నించారు. బుల్లెట్లు కురిపించి రైతులను పొట్టన పెట్టుకున్న పాపానికి, ముందు కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపాలని నీచమైన రాజకీయాలు చేసిన కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టుకుని రైతుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతాంగాన్ని రక్తకన్నీరు పెట్టించిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ అన్నదాత ఎన్నటికీ క్షమించడన్నారు.
వరిధాన్యం కొనుగోలు పోరులో కాంగ్రెస్ ఎక్కడ?
వరిధాన్యం కొనుగోలుపై మోదీ సర్కారు మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతు ఆందోళనకు దిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల పథకాలను ఇతర రాష్ట్రాలలో అమలు చేయాలని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అమలు చేస్తామని సభలు ఎందుకు పెట్టరన్నారని ప్రశ్నించారు. వ్యవసాయం, రైతుల కష్టాల మీద రాహుల్ గాంధీ అవగాహన లేదన్నారు. వ్యవసాయరంగానికి సాగునీరు, రైతుబంధు, రైతుభీమా, ఉచిత కరంటు, కరంటు మౌళిక వసతుల కల్పన కోసం ఎనిమిదేళ్లలో రూ.3 లక్షల 80 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుదన్నారు.
24 గంటల ఉచిత కరెంట్
దేశంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎనిమిదేండ్లలో ఉచిత విద్యుత్ కోసం రూ.87 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. ఈ వెలుగులను కూడా ఓర్చుకోలేక లోకల్ కాంగ్రెస్ నాయకులు 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలని కేంద్రానికి లేఖలు రాస్తూ రైతుద్రోహానికి పాల్పడుతున్నారన్నారు. భవిష్యత్ లో రైతుకు కరెంట్ కష్టమే రానివ్వకుండా కాపాడే యాదాద్రి థర్మల్ ప్లాంట్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూసేస్తామని ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు ప్రకటనలు చేస్తున్నారన్నారు.
రాహుల్ గాంధీకి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించడం చేతగాలేదని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. 70 వేల టీఎంసీల నీళ్లతో పొంగిపొర్లే జీవనదులున్నా, సగం కూడా వాడుకోలేక కరవు కాటకాలకు కారణమైన అసమర్థ పార్టీ కాంగ్రెస్ అన్నారు. అలాంటి పరిస్థితులలో రైతు సంఘర్షణ సభ పేరుతో తెలంగాణలో రాజకీయం చేసేందుకు రాహుల్ గాంధీ వస్తున్నారన్నారు. ముందు ఈ అంశాలపై తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)