Hyderabad: మహిళా ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్- ఈ 13 నుంచి కొత్త సర్వీసు షురూ
Hyderabad Ladies Special Bus: హైదరాబాద్ లోని మహిళా ప్రయాణికులకు కోసం TSRTC శుభవార్త చెప్పింది. మహిళా ప్రయాణికుల కోసం మరో ప్రత్యేక బస్సును ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
Hyderabad Ladies Special Bus Route no 9X/272:
ఇటీవల రాఖీ సందర్భంగా కొన్ని ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడిపిన టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ లో కొన్ని మార్గాల్లో సర్వీసులను పునరుద్ధరించింది. తాజాగా హైదరాబాద్ లోని మహిళా ప్రయాణికులకు కోసం TSRTC శుభవార్త చెప్పింది. మహిళా ప్రయాణికుల కోసం మరో ప్రత్యేక బస్సును ఆర్టీసీ ఏర్పాటు చేసింది. చార్మినార్- గండి మైసమ్మ మార్గంలో ఈ లేడీస్ స్పెషల్ బస్సును నడపాలని సంస్థ నిర్ణయం తీసుకుంది.
బుధవారం (సెప్టెంబర్ 13) నుంచి 9X/272 నెంబర్ గల ఈ సర్వీస్ ప్రారంభమవుతుంది. ప్రతి రోజు ఉదయం 8:25 గంటలకు గండిమైసమ్మ నుంచి జీడిమెట్ల, బాలానగర్, ముసాపేట, ఎర్రగడ్డ, అమీర్ పేట, లక్దికాపుల్, గాంధీ భవన్, అఫ్జల్ గంజ్ మీదుగా ఈ లేడీస్ స్పెషల్ బస్సు చార్మినార్ వెళ్తుంది. సాయంత్రం 5:20 గంటలకు అదే మార్గంలో చార్మినార్ నుంచి బయలుదేరిన బస్సు గండి మైసమ్మకు వెళ్తుంది. ఆ మార్గంలో ప్రయాణించే మహిళలు టీఎస్ ఆర్టీసీ ఈ బస్సు సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.
2 బస్సు సర్వీసులు పునరుద్ధరణ
హైదరాబాద్ లోని ప్రయాణికులకుTSRTC లేటెస్ట్ బస్సు సర్వీసులపై అప్ డేట్ ఇచ్చింది. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ మార్గంలో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం కావడంతో ఆ రూట్లో వెళ్లే బస్సులను TSRTC పునరుద్ధరించింది. గతంలో లాగానే 113 నెంబర్ బస్సులు ఆ రూట్ లో యథావిధిగా నడుస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
సికింద్రాబాద్- మణికొండ మార్గంలో కొత్తగా బస్సులను నడపాలని టీఎస్ ఆర్టీసీ నిర్ణయించినట్లు సజ్జనార్ తెలిపారు. 5 K/M నెంబర్ గల ఈ బస్సులు మెహిదీపట్నం మీదుగా మణికొండకు వెళ్తాయి. ఈ సదుపాయాలను వినియోగించుకుని.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరుతోంది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో తెలిపారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులు
గ్రేటర్ జోన్ పరిధిలో వచ్చే నెల నుంచి విద్యుత్ బస్సులను నడిపాలని తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కొత్తగా వచ్చే విద్యుత్ బస్సులను నగరంలో ఏయే మార్గాల్లో నడపాలనే దానిపై ఆర్టీసీ అధికారులు ఆన్ లైన్ సర్వే చేస్తున్నారు. ముఖ్యంగా ఏ మార్గంలో విద్యుత్ బస్సులు నడిపితే ఆక్యుపెన్సీ పెరుగుతుంది, పాత మార్గాల్లోనే వీటిని నడపాలా లేదా కొత్త మార్గాలను ఎంపిక చేయాలా అని ఆలోచిస్తుంది. అంతేకాకుండా మెట్రో రైళ్లు ఉన్న మార్గాల్లో నడిపితే లాభం ఉంటుందా అనే దానిపై ప్రజల స్పందన కోరుతున్నారు. ఇందుకోసమే ఆన్ లైన్ లో సర్వే నిర్వహించి.. ఆపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఆరు నుంచి ఏడాదిలోగా దాదాపు వెయ్యికి పైగా విద్యుత్ బస్సులను నడిపించే ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణలో ఆర్టీసీబసుల్లో ప్రయాణించే ప్రయాణికులకు సంస్థ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో ఫ్రీ వైఫై సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్టు ఆర్టీసీఎండీ సజ్జనార్ చెప్పారు.