(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad Crime News: ఆన్ లైన్ బెట్టింగ్ తో అప్పులపాలైన యువ ఇంజినీర్ - బాధ భరించలేక ఆత్మహత్య!
Hyderabad Crime News: ఆన్ లైన్ లో బెట్టింగ్ ఆడుతూ అప్పుల పాలయ్యాడో యువ ఇంజినీర్. ఆపై వాటిని కట్టలేక, ఇంట్లో చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
Hyderabad Crime News: పాతికేళ్లు కూడా నిండని ఓ యువకుడు ఆర్ధంతరంగా ప్రాణాలు తీసుకున్నాడు. అందుకు కారణం ఆన్ లైన్ బెట్టింగ్. వర్క్ ఫ్రం హోం చేస్తున్న సదరు యువకుడు ఆన్ లైన్ లో బెట్టింగ్ ఆడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. అప్పటికైనా దాన్ని ఆపేయడం మానేసి అప్పులు చేసి మరీ ఆడాడు. అదే అతడిని అప్పులపాలయ్యేలా చేసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు.. ఆత్మహత్య చేసుకున్నాడు. కన్నతల్లికి తీవ్ర శోకాన్ని మిగిల్చాడు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ చంపాపేట్ సాయిరాం నగర్ లో నివాసం ఉండే 24 ఏళ్ల బి మోహన్ కృష్ణ ఓ సంస్థలో అసిస్టెంట్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. తండ్రి మూడేళ్ల క్రితమే చనిపోవడంతో... తల్లి, అన్నయ్య, వదినతో కలిసి ఉంటున్నాడు. అయితే కొంత కాలంగా మోహన్ కృష్ణ ఆన్ లైన్ లో బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నాడు. ఎంత పోగొట్టుకున్నా ఏమాత్రం భయం, బెరుకూ లేకుండా తన వద్ద ఉన్నందతా పెట్టేశాడు. అదీ పోగా.. అప్పులు చేశాడు. ఆ డబ్బును కూడా ఆన్ లైన్ బెట్టింగ్స్ లో పెట్టి అప్పులపాయ్యాడు. ఈ విషయాన్ని ఇటు ఇంట్లో చెప్పలేక, అటు డబ్బులు కట్టలేక నానా ఇబ్బందులు పడ్డాడు. తీవ్ర మనస్తాపం చెందిన మోహన్ కృష్ణ చావే శరణ్యం అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంటి వద్ద నుంచే పని చేస్తున్న అతడు.. ఆదివారం ఉదయం బయటకు వెళ్లాడు.
బొల్లరంబజార్-అల్వాల్ రైల్వే స్టేషన్ మధ్య రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆ విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయాడు. మరుసటి రోజు అక్కడ ఓ మృతదేహం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చూశారు. ఓ యువకుడు మృతదేహం రైలు పట్టాలపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద లభ్యమైన సెల్ ఫోన్ ఆధారంగా చనిపోయింది మోహన్ కృష్ణగా తేల్చారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.
గతేడాది జూన్ లోనూ ఇలాంటి ఘటనే..
వరంగల్ లో ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ కు ఓ యువకుడి బలి అయ్యాడు. పది లక్షల వరకూ మోసపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు.. నమ్మిన వాళ్లే తనను మోసం చేశారంటూ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అప్పట్లో ఆ వీడియో వైరల్ గా మారింది. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం మలక్ పల్లికి చెందిన రామకృష్ణ అనే యువకుడు హన్మకొండలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ లకు అలవాటు పడ్డాడు. అలా ప్రతిరోజూ గేమ్స్ ఆడుతూ దాదాపు 10 లక్షల వరకూ పోగొట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామకృష్ణ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతూ రామకృష్ణ రెండు రోజుల తర్వాత మృతి చేందాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు.. నమ్మిన స్నేహితులే నన్ను మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో ద్వారా తెలిపాడు.