Hyderabad Crime News: గ్రూప్-1కు అర్హత సాధించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి - విహార యాత్రకు వెళ్లి మృతి
Hyderabad Crime News: అతడో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. గ్రూప్-1 కు అర్హత కూడా సాధించాడు. ఈ క్రమంలోనే భార్యతో కలిసి ఇండోనేషియా వెళ్లి ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోయాడు.
![Hyderabad Crime News: గ్రూప్-1కు అర్హత సాధించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి - విహార యాత్రకు వెళ్లి మృతి Hyderabad Crime News Software Engineer Died in Indonesia Who Went Vacation With Wife Hyderabad Crime News: గ్రూప్-1కు అర్హత సాధించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి - విహార యాత్రకు వెళ్లి మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/25/e97f42cf5c6f1f3138b566724aeecf1b1674633194915519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad Crime News: హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గ్రూప్-1 మెయిన్స్ కు అర్హత కూడా సాధించాడు. భార్యతో కలిసి తాజాగా వెకేషన్ కోసం ఇండోనేషియా వెళ్లాడు. అక్కడే ప్రమాదవశాత్తు సముద్రంలో పడి చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ నాగోల్ పీఎస్ సమీపంలోని అజయ్ నగర్ లో నివాసం ఉండే రాముని రవీందర్ కు ఇద్దరు కుమారులు. వీరిలో చిన్నవాడైన వంశీకృష్ణ(27) సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్ అవుతూనే గ్రూప్-1 ఫలితాల్లో మెయిన్స్ అర్హత సాధించాడు. గతేడాది జూన్ 23వ తేదీన కర్మాన్ ఘాట్ కు చెందిన యువతితో అతడికి వివాహం జరిగింది. ఈనెల 13వ తేదీన భార్య, ఇతర బంధువులతో కలిసి మలేసియా, ఇండోనేషియాలకు విహార యాత్ర కోసం వెళ్లారు. మొదట మలేసియా యాత్ర పూర్తయిన తర్వాత ఇండోనేషియాలోని బాలీకి వెళ్లారు. ఈనెల 22వ తేదీన ఆదివారం వంశీకృష్ణ బాలిలో సముద్ర గర్భంలోని అక్వేరియం సందర్శించేందుకు ఒంటరిగా వెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడి నిర్వాహకులు సూచించినట్లుగానే కాళ్లకు చెప్పులు, ఆక్సిజన్ సిలిండర్ ధరించి వెళ్లాడు. కానీ సముద్రంలోకి దిగి గల్లంతయ్యాడు.
భార్య అతని రాక కోసం చాలా సేపు ఎదురు చూసినా పైకి అతడు పైకి రాకపోవడంతో.. నిర్వాహకులకు తెలిపింది. లోపలికి వెళ్లి చూసిన నిర్వాహకులకు కూడా అతడు కనిపించకుండా పోవడంతో.. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి పోలీసులు సముద్రంలో గాలించి వంశీకృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. అతను అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. నగరంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు మంగళవారం ఉదయం బాలీకి బయలుదేరి వెళ్లారు అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సముద్రంలో గల్లంతైన వంశీకృష్ణ నీటిలోకి వెళ్లాక భయపడడంతో గుండెపోటుతో మృతి చెందాడని అక్కడ పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
హైదరాబాద్ లో నడిరోడ్డుపై వ్యక్తి హత్య
హైదరాబాద్ కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని జియాగూడ రోడ్డుపైన అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు అతి దారుణంగా కత్తితో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది చూసిన స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. పట్టపగలు నడిరోడ్డుపై వాహనదారులు చూస్తుండగానే యువకుడిని ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్ర గాయాలకు గురైన సదరు యువకుడు అక్కడక్కడే మృతి చెందాడు. ఘటన తర్వాత ముగ్గురు నిందితులు అక్కడి నుంచి తలోదిక్కుకీ పరారయ్యారు. అయితే, హత్యకు గురైన యువకుడి వివరాలు, హత్యకు గల కారణాలు ఏమీ తెలియరాలేదు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో న్యూ జియాగూడలోని పురాణాపూల్ వెళ్లే రోడ్డుపై ఈ ఘటన జరిగింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)