HCA Dispute: అజారుద్దీన్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు, హైకోర్టు నోటీసుపై అక్కడికే వెళ్లాలని ఆదేశం
HCA Dispute: మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఇచ్చిన నోటీసుపై అక్కడికే వెళ్లాలని ఆదేశించింది.
HCA Dispute: భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు ఇచ్చిన నోటీసులపై అక్కడికే వెళ్లి తేల్చుకోవాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ నోటీసులు సవాల్ చేస్తూ అజారుద్దీన్ సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అజారుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్ కేవలం.. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన కోర్టు ధిక్కరణ నోటీసును వ్యతిరేకిస్తూ మాత్రమే చేసిన అభ్యర్థన అయినందున.. ఈ దశలో తాము పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన నోటీసులపై హైకోర్టుకే వెళ్లి తేల్చుకోవాలని ఆదేశించింది.
అయితే.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే లీగ్ మ్యాచుల్లో పాల్గొనేందుకు తమను కూడా అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని 2021 లో నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. 2021-22 లీగ్ మ్యాచ్ లకు నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ను అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనుబంధ జట్టుగా ఉన్న తమను భవిష్యత్తులో జరగబోయే అన్ని సమావేశాలు, మ్యాచ్ లు, టోర్నమెంట్ లకు అనుమతించేలా అప్పటి హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కు, బీసీసీఐకి ఆదేశాలు ఇవ్వాలని నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మరో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను కూడా గత సంవత్సరం విచారించిన హైకోర్టు.. నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
2022 లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పాటించడం లేదని ఆరోపిస్తూ.. 2023 ప్రారంభంలో నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్డీసీఏ ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ను కూడా హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ అనుమతించం లేదని పిటిషన్ లో పేర్కొంది. నల్గొండ క్రికెట్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఏప్రిల్ లో అజారుద్దీన్ కు కోర్టు ధిక్కరణ నోటీసులను జారీ చేసింది. ఈ నోటీసులపై గత నెల 23వ తేదీన అజారుద్దీన్ కోర్టుకు తన వివరణ ఇచ్చారు. అయితే తన స్పందనతో హైకోర్టు సంతృప్తి చెందకపోవడంతో.. ఆగస్టు 4వ తేదీన మరోసారి హైకోర్టు ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. కాగా.. ఈ నోటీసులపై అజారుద్దీన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ కూడా అజారుద్దీన్ కు ఎదురుదెబ్బ తగిలింది.
జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్ ను విచారించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా మీరు సుప్రీం కోర్టు వచ్చారు మీరు కోర్టు ధిక్కరణకు పాల్పడలేదా అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దానికి అజారుద్దీన్ తరఫు న్యాయవాది లేదు అనే సమాధానం చెప్పడంతో ద్విసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. అదే విషయాన్ని హైకోర్టుకు వెళ్లి చెప్పండి అంటూ బెంచ్ వ్యాఖ్యానించింది. తమ పిటిషన్ ఉపసంహరణకు అజారుద్దీన్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేయడంతో అందుకు అంగీకరించిన బెంచ్ కేసు విచారణను ముగించింది.