Ganesh Immersion: వినాయక నిమజ్జనం అలా చేయకండి, అర్థం చేసుకోండి - భక్తులకు హైదరాబాద్ సీపీ విజ్ఞప్తి
Hyderabad Ganesh Immersion: హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు జరుగుతున్న తీరుపైన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇంకా వెయ్యి విగ్రహాలదాకా నిమజ్జనం కోసం ఉన్నాయన్నారు.
Hyderabad CP on Ganesh Immersion: హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నగరంలోని గణేష్ మండపాల నిర్వాహకులకు కీలక విజ్ఞప్తి చేశారు. వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఒకరోజు సెలవు కూడా ఇస్తోందని.. కానీ కొందరు శోభాయత్రలను సెలవు రోజు అర్ధరాత్రి, లేదా తెల్లవారుజామున స్టార్ట్ చేస్తున్నారని అన్నారు. ఇలా చేయడం వల్ల నిమజ్జనం మరుసటి రోజు సాయంత్రం వరకు కొనసాగుతోందని అన్నారు. దీనివల్ల నిమజ్జనం ఆలస్యం అవడంతోపాటు, సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది అవుతోందని అన్నారు.
కనీసం వచ్చే ఏడాది నుంచి అయినా ఈ పద్ధతి మానుకోవాలని హైదరాబాద్ సీపీ సూచించారు. 11వ రోజే నిమజ్జనం పూర్తి చేసేలా గణేష్ మండపాల నిర్వహకులు తరలి రావాలని కోరారు. ఇంకా వెయ్యి విగ్రహాల వరకు నిమజ్జనం కోసం వేచి ఉన్నాయని సీపీ చెప్పారు. అన్నింటిని త్వరగా పూర్తి చేస్తున్నామని చెప్పారు.
భద్రత పరంగా బందోబస్తు పరంగా పూర్తి స్థాయిలో ఉందని.. ట్రాఫిక్ కు క్రమంగా విడుదల చేస్తున్నామని చెప్పారు. ఉదయం 10.30 నుంచి అన్ని జంక్షన్స్ లో ట్రాఫిక్ రిలీజ్ చేశామని చెప్పారు. ఈసారి గత ఏడాది కన్నా ముందే ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చామని అన్నారు. దాదాపుగా అన్ని ఫ్లై ఓవర్ లపై ట్రాఫిక్ ను అనుమతించామని.. ప్రణాళిక ప్రకారం ఖైరతాబాద్ గణపతి 6.30కి మొదలయి.. 1.30కి నిమజ్జనం పూర్తి అయ్యిందని అన్నారు. అందుకు సహకరించిన ఉత్సవ కమిటీకి సీపీ ధన్యవాదాలు తెలిపారు.
తమ పోలీసులు అందరూ కలిసి లా అండ్ ఆర్డర్ కోసం చాలా బాగా కృషి చేశారు. సౌత్ వెస్ట్ లో కొన్ని మండపాల నిర్వహకులు నిమజ్జనానికి ఇంకా ముందుకు రాలేదని, పరిస్థితులు వారు అర్దం చేసుకోవాలని అన్నారు. ఇప్పటికి హుస్సేన్ సాగర్ లో 5,500 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని చెప్పారు. ఇవన్నీ రికార్డులో ఉన్నవే అని.. ఇతర ప్రాంతాల్లో కూడా జరిగిన నిమజ్జనాలు అన్ని కలిపి దాదాపుగా 15 వేల వరకు ఉంటాయని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో 15 నుంచి 20 అడుగుల విగ్రహాలు వచ్చి ఆగిపోయాయని.. అబిడ్స్ లో టస్కర్ లు, వాహనాలు కండిషన్ బాగోలేక ఆగిపోయాయని అన్నారు.
ఇలాంటి అవాంతరాలు లేకపోతే ఇంకా త్వరగా నిమజ్జనం పూర్తి అయ్యేది. మా లా అండ్ ఆర్డర్, మిగతా విభాగపు పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ, అన్ని విభాగాల అధికారులు అందరూ కలిసి దాదాపు 40 గంటలకు పైగా పని చేస్తున్నారు. వారందరికీ అభినందనలు. చిక్కడపల్లి, ఈస్ట్ జోన్ లో కొన్ని సమస్యలు వచ్చాయి. కొంత మంది తాగి గొడవలు చేశారు’’ అని హైదరాబాద్ సీపీ వెల్లడించారు.