Hyderabad Murder: అడ్డా కూలీపై ఆ జంట కన్నేసిందంటే ఎవరో ఒకరు బలి అవ్వాల్సిందే
అందంగా ఉండి, ఆభరణాలు ఉన్న ఆడవాళ్లే లక్ష్యంగా చేసుకొని అకృత్యాలకు పాల్పడుతున్న జంట బాగోతం హైదరాబాద్‌లో వెలుగు చూసింది. మల్లంపేటకు చెందిన ఓ మహిళ హత్య కేసు విచారణతో ఈ జంట చిక్కింది.
హైదరాబాద్‌లో సహజీవనం చేస్తున్న ఓ జంట దారుణానికి ఒడిగట్టింది. తాజా ఘటనతో గత కొంతకాలంగా వారు చేస్తున్న పైశాచికాలు వెలుగులోకి వచ్చాయి. ఈ జంట ఇతరులను నమ్మించి నేరాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. గురువారం షాపూర్‌నగర్‌లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ పద్మజ ఈ కేసు వివరాలను విలేకరులకు వివరించారు. అసలేం జరిగిదంటే..
ఒంటరిగా అందంగా ఉన్న యువతులు, మహిళలే లక్ష్యంగా చేసుకొని ఈ జంట ఆకృత్యాలకు పాల్పడుతోంది. హైదరాబాద్‌లోని మల్లంపేటకు చెందిన ఓ పేద మహిళ(37) వీరి చేతికి చిక్కి ప్రాణాలు పొగొట్టుకొంది. ఈ కేసు విచారణతో ఆ జంట చేసిన గత నేరాలు బట్టబయలు అయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం వైఎస్‌ఆర్ కాలనీలో నివాసముంటున్న కురువ స్వామి అలియాస్ రవి, మసనమొల్ల నర్సమ్మ సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరు కలిసి ఈ నెల 25న మల్లంపేట లేబర్ అడ్డాకు వెళ్లారు. పని కోసం వచ్చి ఒంటరిగా ఉన్న మల్లంపేటకు చెందిన మహిళ(37)ను వారు గుర్తించారు. ఆమె మెడలో బంగారు ఆభరణాలు ఉండటంతో వారిలో దుర్భుద్ధి కలిగింది. ఆమెను పరిచయం చేసుకున్నారు. ఆలయం వద్ద సున్నం వేసే పని ఉందని, ఆ పని చేస్తే తనకు రూ.700 ఇస్తారని నమ్మించారు. దీంతో వారిని నమ్మిన మహిళ వాళ్ల బైక్‌పైనే పని ప్రదేశానికి వెళ్లింది.
ఆమెను జిన్నారం మండలం అంకిరాల గుట్టల్లోకి తీసుకెళ్లారు. ఆమెకు అనుమానం వచ్చి ప్రశ్నించినా కొండపై ఆలయం ఉందని నమ్మబలికారు. కొండపైకి తీసుకెళ్లి ఆ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. అందుకోసం నర్సమ్మ ఆమెను కదలకుండా పట్టుకొని అతనికి సహకరించింది. బాధితురాలు కేకలు వేస్తుండడంతో ఆమెను నిలువరించేందుకు కిరాతంగా కర్రతో జననాంగాలపై దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె చనిపోయింది. ఆ తర్వాత మెడలోని బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయారు.
అయితే, కూలి పనికి వెళ్లిన భార్య తిరిగి రాలేదని ఆమె భర్త దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకోసం సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. మల్లంపేట లేబర్ అడ్డా నుంచి మహిళను బైక్‌పై తీసుకెళ్తున్నట్లుగా సీసీటీవీ కెమెరాల్లో గుర్తించారు. నిందితులను గుర్తించి వారిని బుధవారం వికారాబాద్ జిల్లాలో అదుపులోకి తీసుకొన్నారు. వారిని విచారణ జరపగా వారి గత నేర చరిత్ర వెలుగు చూసింది.
ఈ జంట గతంలో సంగారెడ్డి జిల్లా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెలలోనే నాలుగు దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి రూ.2 లక్షలు విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.