CM KCR : ధాన్యం కొనుగోలుపై వన్ నేషన్ వన్ ప్రొక్యూర్‌మెంట్ ఉండాలి : సీఎం కేసీఆర్
వన్ నేషన్ వన్ ప్రోక్యూర్ మెంట్ ఉండాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ధాన్యం కొనుగోలుపై పంజాబ్ తరహాలో ఉద్యమం చేస్తామన్నారు.
"ఫుడ్ సెక్యూరిటీ విషయంలో అన్ని దేశాలు స్వావలంబన ఉండాలని కోరుకుంటాయి. భారత్‌లో ఫుడ్ సెక్టార్ పెద్దది కాబట్టి ఏదైనా ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తే ఆహారకొరత రాకుండా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ బాధ్యత కేంద్రానిదే. కేంద్రం ధాన్యం సేకరించాలి. రెండు మూడేళ్ల మిగులు ధాన్యం సేకరించాలి. ఎక్కువ పంట వస్తే ప్రోసెస్ చేసి నష్టం వస్తే కేంద్రం భరించాలి. ఆ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకోకూడదు. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ప్రోక్యూర్‌మెంట్ ఉండాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో నీతి ఉండకూడదు." అని కేసీఆర్ అన్నారు.
'చరణ్ సింగ్, దేవిలాల్, స్వామినాథన్ ఆందోళనలతో అప్పట్లో చేసిన ఉద్యమాలు కారణంగా పంజాబ్ హర్యానా నుంచి వంద శాతం సేకరణ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నో విధానాలు తీసుకొచ్చి పంట ఉత్పత్తిని పెంచాం. ఇప్పుడు తెలంగాణ ప్రశాంతంగా ఉంది. అందుకే యాసంగిలో వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఎంఎస్‌పీ నిర్ణయించేది ధాన్యానికి నిర్ణయిస్తుంది. పంజాబ్‌లో అదే చేస్తున్నారు. అదే పద్దతిలో తెలంగాణలో చేయాలి. బాయిల్డ్ రైస్ వేయమంటున్నారు. మేం ఎందుకు వేస్తాం. పంజాబ్‌లో చేసినట్టే ఇక్కడా చేయండి. బాయిల్ చేసి తీసుకుంటారా ఇంకొకటి చేసి తీసుకుంటారా మీ ఇష్టం. రైతుల సమస్య కాబట్టి యథావిధిగా ధాన్యం తీసుకోవాలి. రేపు మంత్రుల బృందం, పార్లమెంట్ సభ్యుల బృందం ఆహార మంత్రిత్వ శాఖను కలుస్తారు. విజ్ఞప్తి చేశారు. వాళ్లు ఒప్పుకోకుంటే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది. తెలంగాణ ఉద్యమ స్థాయి ఎంత ఉద్దృతంగా ఉందో ఇదే అదే స్థాయిలో ఉంటుంది.
సమాజాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలు జరుగుతున్నాయి. సాంకేతికంగా గెలిచామని బీజేపీ అనుకోవచ్చు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ బలం తగ్గుతుందని ఆనాడే చెప్పాను. అక్కడ సీట్లు తగ్గడం దేనికి సంకేతమో వాళ్లే అర్థం చేసుకోవాలి. పంజాబ్‌లో బీజేపీని తరిమికొట్టేశారు. ఇప్పుడు దేశం కోసం ఒక నిర్ణయానికి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. వీళ్లు వచ్చాక కొత్త ప్రాజెక్టులు కట్టలేదు. కొత్త ఫ్యాక్టరీ కట్టలేదు. ఇప్పుడు దేశం బాగుపడాలంటే... కొత్తదనం రావాలంటే ఈ ప్రభుత్వం పోవాలని ప్రజలు నిర్ణయానికి వచ్చారు.
యూపీఏ బాగాలేదని ప్రజలు తీసేసి బీజేపీకి అధికారం ఇస్తే ఇప్పుడు పరిస్థితులు మరింతగా దిగజారాయి. జీడీపీ భారీగా పడిపోయింది. నిరుద్యోగిత పెరిగిపోయింది. ఈ ప్రభుత్వం కూడా తన పనితనం చూపించింది. మాకు ఇంతే వస్తుంది ఇంతకు మించి చేతకాదని చెప్పకనే చెప్పారు. తమ సామర్థ్యం ఏంటో చెప్పేశారు. కొత్తవి కట్టకపోగా ఉన్న ప్రభుత్వం సంస్థలను అమ్మేస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా నిర్వహిస్తున్న దుష్ప్రచారమే ది కశ్మీర్ ఫైల్స్. దీనవల్లట్వచ్చేదేమీ లేదు. పండిట్స్ కూడా దీన్ని హర్షించడం లేదు. తమకు జరిగిందాన్ని ఓట్లుగా మారుస్తున్నారు. ఇలాంటివి తెలంగాణలో సాధ్యం కావు. తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి విచ్ఛినమైన స్లోగన్స్ తీసుకోలేదు. బీజపీ పాలిత రాష్ట్రాల్లో సెలవులు ఇచ్చి దికశ్మీర్ ఫైల్స్ సినిమా చూడమంటున్నారు. ఇదేమీ విభజన రాజకీయాలు. దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు.
కరోనా విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైంది. కోట్లమంది ప్రజలను రోడ్డున పడేశారు. వేల కిలోమీటర్లు నడిపించారు. రైళ్లు వేయమంటే టికెట్ కూడా మీరే పెట్టుకోమని చెప్పారు. గంగానదిలో శవాలు తేలేలా చేసిన ప్రభుత్వం ఇది. నిన్నగాక మొన్న ఉక్రెయిన్ పరిణామాలు. ఇరవై వేల మంది పిల్లలను తీసుకురాలేదు. ఎంబసీని మార్చేశారు గానీ విద్యార్థులను తీసుకురాలేదు. వాళ్ల చదువులు పోవద్దు అని అనుకున్నాం. మా తర్వాత బెంగాల్ ప్రభుత్వం కూడా రిక్వస్ట్ చేసింది. కేంద్రం స్పందించలేదు. హ్యాపీ ఇండెక్స్‌లో భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే తక్కువగా ఉండటం ఘోరం కాదా. నిరుద్యోగ ర్యాంకింగ్‌లో సిరియా కంటే కింద ఉన్నాం. ఇలా ఎందులో చూసిన ఇదే పురోగమనం.
ఈ పార్టీ తీసుకొచ్చిన దుర్మార్గాలను, కశ్మీర్ ఫైల్స్ లాంటి దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని నిర్ణయించాం. వందకు వంద శాంతం మా వల్ల కాదు.. ప్రతిసారి ఒకటి తీసుకొచ్చి పెడతుతున్నారు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు లేవు. వాటిపై కూడా ధర్నాలు చేస్తాం. ధాన్యంతోనే అయిపోదు... ఇంకా చాలా ఉంది. రిజర్వేషన్ల వ్యవహారంలో యాభైశాతం కంటే ఎక్కువ వద్దని ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అందులో వెసులుబాటు ఉంది. ఏదైనా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి వస్తే మార్చుకోవచ్చని చెప్పింది. శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించాం. గిరిజన రిజర్వేషన్ పెంచుకోవాలని పంపించాం. ఇప్పటి వరకు ఉలుకు పలుకూ లేదు.
ఎస్సీ వర్గీకరణలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించాం. దానిపై కూడా అతీ గతీ లేదు. బీసీల కులగణన చేయమని చెబితే పట్టించుకోలేదు. మాటలు, భేదభావాలు సృష్టించి, విధ్వేషాలు సృష్టించి ఉద్వేగాలకు లోను చేసి దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేలా చేస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వం కుంటిపడుతుంది. ఇదే ప్రభుత్వం కొనసాగితే దేశం మరింత దిగజారుతుంది.
కచ్చితంగా ఈ ప్రభుత్వం పోవాల్సిందే. బ్యాంకుల్లో చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి. రైతులు ధాన్యం కొనగోలు చేయమంటే చేయలేదు కానీ... కానీ బ్యాంకులను మోసం చేసిన వాళ్ల అప్పులు మాఫీ చేస్తున్నారు. గ్రామస్థాయిలో, మండల స్థాయిల, మున్సిపల్, ఇతర మార్కెట్ కమిటీల్లో తీర్మానం చేసి పంపిస్తాం. వీటిని తీసుకుంటారని అనుకుంటున్నాం. లేకుంటే ఉద్యమిస్తాం. గతంలో పంజాబ్‌లో రైతులను ఏడిపించిన కేంద్రం ఉద్యమాలతో దిగి వచ్చింది. ఇక్కడ కూడా అదే స్థాయి పోరాటాలు చూస్తారు. కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు.'