Hyderabad Book Fair 2022: 22 నుంచే హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ - స్థలం, టైమింగ్స్ వివరాలివీ
Hyderabad Book Fair 2022: పుస్తకప్రియులంతా ఎదురు చూస్తున్న బుక్ ఫెయిర్ వచ్చేస్తోంది. ఈనెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు ఈ బుక్ ఫెయిర్ కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు.
Hyderabad Book Fair 2022: రాబోయే తరానికి దార్శనికతను అందించేందుకు బుక్ ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. అక్షరాస్యత పెరుగుతున్న విధంగానే పుస్తక పఠనం కూడా పెరుగుతుందని తెలిపారు. సోమారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ విశేషాలను ఆయన వెల్లడించారు. అయితే పుస్తక ప్రియుల ఎప్పుడెప్పుడూ అని వేచి చూస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈనెల 22వ తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. ప్రతీ సారిలాగే ఎన్టీఆర్ గార్డెన్స్ లోనే ఈ బుక్ ఫెయిర్ జరగనున్నట్లు వెల్లడించారు.
మొత్తం 340 స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడి..
మద్యాహ్నం 2 గంటలల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుందని జూలూరి గౌరీ శంకర్ పేర్కొన్నారు.. పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుక్ ఫెయిర్ కు ఎన్టీఆర్ స్టేడియంను ఉచితంగా ఇవ్వడమే కాకుండా, నిర్వహణకు కూడా సాంస్కృతిక శాఖ ద్వారా నిధులు కేటాయిస్తుందని అన్నారు. ఈ ఏడాది 340 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 10 లక్షల మంది పాఠకులు వస్తారని చెప్పారు.
ప్రతిరోజూ సాయంత్రం సాంసక్కృతిక కార్యక్రమాలు..
మొదటి రోజు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డితో పాటు పత్రికల సంపాదకులు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ హాజరు అవుతారని జూలూరి స్పష్టం చేశారు. కాగా ము ముఖ్యమంత్రి పేరిట కూడా ఓ స్టాల్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలనన, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బుక్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కేంద్ర హిందీ సంస్థాన్ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తుందని వవరించారు. ఇక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కావాల్సిన పుస్తకాలు లభిస్తాయని అన్నారు. అలాగే ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని బుక్ ఫెయిర్ సొసైటీ కార్యదర్శి శృతికాంత్ భఆరతి, ఉపాధ్యక్షుడు కోయ చంద్ర మోహన్ చెప్పారు.
రచయితల పుస్తకాల ప్రదర్శనకు ఛాన్స్..!
గురువారం నుంచి జరగబోయే బుక్ ఫెయిర్ లో రచయితల పుస్తకాల ప్రదర్శన, అమ్మకాలను జరిపేందుకు అవకాశం కల్పిస్తున్నామని హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు. ఉత్సాహపడే రచయితలు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. బుక్ ఫెయిర్ నిబంధనలకు లోబి ప్రతి రచయిత వారి రచనల్లోని ఐదింటిని, ఐదు కాపీలు చొప్పున ప్రదర్శనకు ఉంచవచ్చనన్నారు. ఒకటి నుంచి 10 టైటిల్స్ ఉన్న రచయితలకు ప్రత్యేకంగా ఒక టేబుల్ కేటాయిస్తామని చెప్పారు. అయితే అందుకు ప్రత్యేక రుసుము ఉంటుందని చెప్పారు. వీరికి స్టాల్స్ కేటాయించలేమని కూడా వివరించారు.