World Heritage Day: 45 వేల ఏళ్ల క్రితమే తెలంగాణ నేలమీద మానవ సంచారం
మహోజ్వల చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ సొంతంచరిత్రను కాపాడుకోవడంలో తెలంగాణ పౌరుల భాగస్వామ్యం పెరగాలి
![World Heritage Day: 45 వేల ఏళ్ల క్రితమే తెలంగాణ నేలమీద మానవ సంచారం Human migration on Telangana soil 45 thousand years ago CM KCR World Heritage Day: 45 వేల ఏళ్ల క్రితమే తెలంగాణ నేలమీద మానవ సంచారం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/17/77fdf47fff77ff87181eb9d8edf043c71681752010568233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నాటి ఆదిమానవుని కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు, ప్రతీ చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ నేలకు సొంతమని అన్నారు సీఎం కేసీఆర్. వరల్డ్ హెరిటేజ్ డే (ఏప్రిల్ 18) సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికున్న చారిత్రక ప్రాశస్త్యాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. నాటి ప్రాచీన భారతదేశంలో ఆవిర్భవించిన షోడశ (16) మహా జనపథాల్లో, దక్షిణ భారతదేశంలో విలసిల్లిన ఒకే ఒక జనపథమైన అస్మక మహాజనపథం తెలంగాణ ప్రాంతంలో నేటి బోధన్ (నాటి పౌధన్యపురం) కేంద్రంగా వెలుగొందడం తెలంగాణ గడ్డకున్న ప్రాచీనతను, ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటుతున్నది సీఎం అన్నారు. శాతవాహన శకం నుంచి అసఫ్ జాహీల వరకు సాగిన పాలన తెలంగాణను సుసంపన్నం చేశాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
45 వేల ఏండ్ల కిందటే తెలంగాణ నేలమీద మానవ సంచారం
ఇక్కడి వైవిధ్యభరితమైన నిర్మాణ శైలులు, శిల్పకళలు, ఆయుధాలు, ఆభరణాలు, గుహ చిత్రలేఖనాలు, బొమ్మలు, కట్టడాలు, సంస్కృతి సంప్రదాయాలు, ఆచారాలు, భాష, యాసలు, సాహిత్యం, కళలు వారసత్వ సంపదకు ఆలవాలమని సీఎం కేసీఆర్ అన్నారు.45 వేల ఏండ్లక్రితమే తెలంగాణ నేలమీద మానవసంచారం సాగిందనడానికి నేటి జయశంకర్ భూపాల్ పల్లి జిల్లాలోని పాండవుల గుట్టలో లభ్యమైన ప్రాచీనమానవుని పెయింటింగ్స్ నిదర్శనమని సీఎం తెలిపారు.
తెలంగాణ వారసత్వం, ప్రపంచ వారసత్వ సంపదగా వెలుగులోకి
జైన బౌద్ధ ఆరామాలు, రామప్ప దేవాలయం, వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు కోట, భువనగిరి కోట, గోల్కొండ కోట, పాండవుల గుట్ట, పద్మాక్షి గుట్ట, మెదక్ చర్చి, మక్కా మసీదు, చార్మినార్ వంటి ఎన్నో గొప్పగొప్ప కట్టడాలు, సహజ నిర్మాణాలు తెలంగాణ చారిత్రక, వారసత్వ వైభవాన్ని, వైవిధ్యతను, ప్రత్యేకతను చాటుతున్నాయని సీఎం పేర్కొన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చడం తెలంగాణ ప్రజలకు, దేశానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. దాంతోపాటు దోమకొండ కోటకు యునెస్కో ఆసియా – పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డు, కుతుబ్‌షాహి టుంబ్స్ కాంప్లెక్స్‌లోని మెట్లబావికి యునెస్కో అవార్డు వంటి పలు జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు సాధిస్తూ ఘనమైన తెలంగాణ వారసత్వం, ప్రపంచ వారసత్వ సంపదగా వెలుగులోకి వస్తున్నదని సీఎం అన్నారు.
భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత వారసత్వ సంపదల పరిరక్షణలో భాగంగా ఖిలా వరంగల్ కోట ఆధునీకరణ, చార్మినార్, మక్కా మసీదు వంటి ప్రాచీన కట్టడాలకు మరమ్మతులు, మోజంజాహి మార్కెట్, మోండా మార్కెట్ వంటి ప్రాచీన నిర్మాణాలకు ప్రభుత్వం మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడుతున్నదని సీఎం తెలిపారు. ఇటీవల 300 ఏళ్ల ప్రాచీనమైన బన్సీలాల్ పేట మెట్ల బావితో సహా మరో ఆరు మెట్లబావులను పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం రానున్న కాలంలో మరిన్ని బావులను గుర్తించి పునరుద్ధరించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ చారిత్రక సంపదను వారసత్వాన్ని, తెలంగాణ గత వైభవాన్ని పునరుజ్జీవింపచేసి భావితరాలకు అందించేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ దిశగా రాష్ట్ర పురావస్తు, సాంస్కృతిక పర్యాటకశాఖల కృషిని సీఎం అభినందించారు. ఈ దిశగా తెలంగాణ చరిత్రకారులు మేధావులు స్వచ్ఛందంగా కొనసాగిస్తున్న కృషి అభినందనీయమని కేసీఆర్ అన్నారు. చరిత్రను కాపాడుకోవడంలో తెలంగాణ పౌరులు చైతన్యవంతమైన యువత భాగస్వామ్యం మరింతగా పెరగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)