రాత్రి పగలు రంగులు మారేలా కొత్త సెక్రటేరియట్- తెలంగాణ సచివాలయం లోపల చూస్తే మామూలుగా ఉండదు
తెలంగాణ నూతన సచివాలయ ప్రత్యేకతలు- మచ్చుకు కొన్ని చూద్దాం!
ఇటు చూస్తే నింగికి బాహువులు చాపినట్టుగా అంబేద్కర్ విగ్రహం! ఎదురుగా అఖండ జ్యోతి వెలుగుతున్నట్టుగా తెలంగాణ అమరు వీరుల స్మారకచిహ్నం! తలపక్కకి తిప్పితే తథాగథుడి మౌనముద్ర చుట్టూ అపార జలరాశి- హుస్సేన్ సాగర్! మధ్యలో నీటిని వయ్యారంగా ఆకాశానికి ఎగజిమ్మే ఫౌంటెయిన్! దూరంగా జాతీయజెండా రెపరెపలు! ఆధునిక పాలనా దేవాలయంగా అభివర్ణించే నూతన సచివాలయం- నభూతో నభవిష్యతి! ఎక్కడా రాజీపడలేదు! ఏ విషయంలోనూ వెనక్కి తగ్గలేదు! వందేళ్ల విజన్ తో నిర్మించిన సెక్రటేరియట్ ప్రత్యేకతలు- మచ్చుకు కొన్ని చూద్దాం!
పగలు ధవళవర్ణం! రాత్రిళ్లు సప్తవర్ణం! సచివాలయం ప్రాంగణంలో నీళ్లుచిమ్మే ఫౌంటెయిన్ స్పెషాలిటీ అదే! పచ్చటి తివాచీ పరిచినట్టుగా గ్రీన్ లాన్ కనువిందు చేస్తుంది! గుమ్మటాలు గతకాలపు చారిత్రక నేపథ్యానికి అద్దం పడుతున్నట్టుగా ఉంటాయి! స్టోన్ డిజైన్ వర్క్ అదనపు హంగు! సెక్రటేరియట్ ప్రధాన ద్వారం అత్యంత విశాలంగా ఉంటుంది. ఆ దర్వాజని భోపాల్ నుంచి ప్రత్యేకంగా వుడ్ కార్వింగ్ చేసి తెప్పించారు!
సీఎం కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు! సచివాలయంలో సీఎం ఛాంబర్ కూడా ఆరో అంతస్తులో ఉంటుంది! అక్కడ ఫర్నిచర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి! వాల్ క్లాడింగ్, డెకరేషన్ వేరే లెవల్లో ఉంటాయి! ఎటు చూసినా రాయల్ లుక్! తెల్లటి రంగుతో కూడిన గోల్డ్ కలర్ పట్టీలతో తీర్చిదిద్దిన గోడలు! గోడల రంగుతో సరిపోయే విధంగా మార్బుల్ ఫ్లోరింగ్, విశాలమైన కారిడార్లు! అంతే అందంగా తీర్చిదిద్దిన ఛాంబర్ల డోర్స్.. ఇలా దేనికదే ప్రత్యేకం! సీఎం ఛాంబర్ లోని సమావేశ మందిరంలోకి ప్రవేశించగానే మరోలోకంలో అడుగుపెట్టినట్టుగా ఉంటుంది! అందులో ఫర్నిచర్ సింప్లీ సూపర్బ్!
ఇక, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సెపరేట్ ఛాంబర్! CS సిబ్బంది కోసం ఆఫీసులు. కాన్ఫరెన్స్ హాల్, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్! అందులో ఏసీ నుంచి వైఫై వరకు సలక సౌకర్యాలు! డైనింగ్ తదితర అవసరాలకోసం మల్టీ పర్సస్ గా వాడుకోవడానికి విశాలంగా ఉంటుంది! జీఏడీ ప్రోటోకాల్ సిబ్బంది కోసం ప్రత్యేక ఛాంబర్. కలెక్టర్ల కాన్పరెన్స్ హాల్, ప్రజాప్రతినిధుల కోసం వెయిటింగ్ లాంజ్, వీఐపీల వెయిటింగ్ లాంజ్! మంత్రులకు కేటాయించిన శాఖలు అన్నీ ఒకేదగ్గర వుండే విధంగా డిజైన్ చేశారు. ఆయా శాఖలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యకు అనుకూలంగా కార్యాలయాలు. సచివాలయం దక్షిణ భాగంలో పార్కింగ్ సదుపాయం. ప్రహారీకి అంతర్గతంగా, బయట పక్కా రోడ్లు!
ఇటు వైపు వస్తే దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం! స్టాచ్యూ అడుగు భాగాన విశాలమైన హాల్స్! ఆడియో విజువల్ ప్రదర్శనకోసం ఆడిటోరియం! బయట ఫౌంటెయిన్, లాండ్ స్కేపింగ్! ఇటొస్తే అమరవీరుల జ్యోతి! 365 రోజులు వెలిగే అఖండదీపం మెయిన్ కాన్సెప్ట్! మొదటి అంతస్తులో ఆడియో, వీడియో ప్రదర్శనల కోసం ఆడిటోరియం! లేజర్ షో, ర్యాంప్, సెల్లార్ పార్కింగ్ తదితర సదుపాయాలు ఉంటాయి.
ప్రపంచం మెచ్చేలా తీర్చి దిద్దుతున్న ఈ సచివాలయాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. అందుకు తగ్గట్టుగానే పనులు వేగవంతం చేయాలని అధికారులకు శుక్రవారం దిశానిర్దేశం చేశారు.