Heavy Rains: హైదరాబాద్‌కు నేడు సాయంత్రం భారీ వర్షాలు! ఎల్లో అలెర్ట్ జారీ
Hyderabad Weather News: హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో ఇప్పటికే ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
Heavy Rains : నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) తెలంగాణ (Telangana) అంతటా క్రమంగా ప్రవేశిస్తున్నాయి. ఆదివారం నాటికి నిజామాబాద్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరో 2, 3 రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా మారాయని వెల్లడించారు. ఈప్రభావం ఎక్కువగా హైదరాబాద్ నగరంపై కనిపిస్తున్నట్టు తెలిపారు. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
నైరుతి రుతుపవాలు.. తెలంగాణ సహా దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సగటున 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఆవరించాయి. అయితే.. అది ఆదివారం(Sunday) నాటికి బలహీనపడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే రోజుల్లో.. రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని..
ముఖ్యంగా హైదరాబాద్ కు మరింత ప్రభావం ఉంటుందని, ఆదివారం మధ్యాహ్నం నుంచి తేలిక పాటి జల్లుల తో ప్రారంభమై.. రాత్రికి అవిమరింత పెరిగే అవకాశం ఉంటుందని తెలిపింది. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట వంటి ప్రాంతాల్లో గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా ఉరుములు, మెరుపులకు కూడా అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్‌లో పరిస్థితి ఇదీ..
హైదరాబాద్(Hyderabad)లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఆదివారం సాయంత్రం నుంచి వాతావరణంలో మార్పులు వస్తాయని వాతావరణ కేంద్రం వివరించింది. ఉరుములు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. కుండపోత వర్షాలకు కూడా అవకాశం కూడ ఉందని తెలిపింది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీల సెల్సియస్ మరియు 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందని, ఉపరితల గాలులు పశ్చిమ, దక్షిణ దిశల నుంచి గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వివరించింది.
ఎల్లో అలర్ట్ జారీ చేసింది
భారత వాతావరణ శాఖ(IMD) ఆదివారం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ అంతటా కొన్ని ప్రాంతాల్లో వర్షం, మెరుపులు, ఈదురు గాలులు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
గత నాలుగు రోజుల్లో..
హైదరాబాద్ నగరంలో వరుసగా నాలుగో రోజు కూడా పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా ముషీరాబాద్‌లో 34.5, బాలానగర్‌లో 19.8, ఉప్పల్‌లో 18.8, పటాన్‌చెరులో 16.8, ఖైరతాబాద్‌లో 16, సికింద్రాబాద్‌లో 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని బేగంపేట సర్కిల్‌లో అత్యధికంగా 14.8 మిమీ, ముషీరాబాద్‌లో 13.8 మిమీ, ఉప్పల్‌లో 11.7 మిమీ, సికింద్రాబాద్‌లో 11.4 మిమీ, రామచంద్రపురం, పటాన్‌చెరులో 8.5 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.
పలు జిల్లాల్లో కూడా..
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 4.7 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెంజిల్లాలో 3.8 మి.మీ, సంగారెడ్డి జిల్లాలో 3.6 మి.మీ, హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 3.3 మి.మీ, యాదాద్రి భువనగిరి3.2 మి.మీ, మేడ్చల్-మల్కాజిగిరిలో 1.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఖమ్మంలో 1.5 మి.మీ, సూర్యాపేట లో 1.1 మి.మీ వర్షపాతం నమోదైంది.