Hyderabad Gangrape: టెన్త్ క్లాస్ విద్యార్థుల ఘాతుకం! తోటి బాలికపై గ్యాంగ్ రేప్ - వీడియోలు తీసి మళ్లీమళ్లీ
పదో తరగతి చదువుతున్న బాలికపై తోటి విద్యార్థులే సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ సమయంలో సెల్ ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Hyderabad Rape Case: హైదరాబాద్ శివారులో ఓ మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగింది. పదో తరగతి చదువుతున్న బాలికపై తోటి విద్యార్థులే సామూహికంగా అత్యాచారం చేశారు. ఆ సమయంలో సెల్ ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆరు నెలల క్రితం జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజాగా అత్యాచారం చేసిన ఐదుగురు మైనర్ బాలురను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ శివారులోని హయత్ నగర్‌లో ఈ ఘటన జరిగింది.
Hayath Nagar Latest News: హయత్ నగర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హయత్ నగర్ సమీపంలోని తట్టి అన్నారం ప్రాంతంలో ఓ పాఠశాలలో బాధితురాలితో పాటు నిందితులు కూడా పదో తరగతి చదువుతున్నారు. ఈ బాలురు నీలిచిత్రాలు చూడడం మొదలుపెట్టి వాటికి బానిసలు అయ్యారు. అలా 17 ఏళ్ల తోటి విద్యార్థినిపై కన్నేశారు. ఒకటే క్లాసు కావడంతో అందరూ ఫ్రెండ్లీగా ఉండడంతో వారు లైంగిక దాడికి ప్రణాళిక వేశారు. ఆమె కదలికలను గమనించేవారు. ఓసారి బాధితురాలి ఇంట్లో ఆమె తల్లిదండ్రులు లేకపోవడం, ఆమె ఒంటరిగా ఉండటం గమనించి ఐదుగురు బాలురు ఆమె ఇంట్లోకి వెళ్లారు.
ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారం చేశారు. దీన్ని వారిలో ఒకరు ఫోన్లో రికార్డు కూడా చేసి, ఎవరితోనూ చెప్పొద్దని భయపెట్టారు. దీంతో ఆమె తనపై జరిగిన లైంగిక దాడిని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత నిందితుల్లో ఒకడు మళ్లీ ఆ వీడియోలు చూపించి తనకు అనుకూలించకపోతే ఆ సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి మరోసారి అత్యాచారం చేశాడు. ఇలా నిందితులు తరచూ ఆ వీడియోను అడ్డు పెట్టుకొని ఆమెపై అత్యాచారం చేస్తూ వస్తున్నారు. ఇటీవల బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో అసలు సంగతి బయటపడింది.
పోక్సో చట్టం కింద కేసు నమోదు
వెంటనే వారు గత ఆదివారం హయత్ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐదుగురు నిందితులపైనా పోక్సో చట్టంతోపాటు అసభ్యకర వీడియోను చిత్రీకరించి, షేర్ చేసినందుకు ఐటీ చట్టం కింద కూడా కేసులు పెట్టారు. సెక్షన్ 67ఏ, 67బీ కింద కూడా కేసులు నమోదు చేశారు. బాధితురాలికి మెడికల్ టెస్టుల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నేరానికి సంబంధించి సాంకేతిక ఆధారాలు సేకరించి, 24 గంటల్లోనే ఐదుగురు మైనర్లను అరెస్టు చేశారు. వారి దగ్గర మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు.
రాచకొండ పోలీసుల హెచ్చరిక
ఆ తర్వాత వారిని జువెనైల్ హోంకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి మైనర్ల అత్యాచార వీడియోను జనాలు ఎవరూ మరొకరికి ఫార్వర్డ్ చేయొద్దని రాచకొండ పోలీసులు చెప్పారు. ఎవరైనా ఈ వీడియోలు చూస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఒకవేళ తమ ఆదేశాలను బేఖాతరు చేసి ఫార్వర్డ్‌లు చేస్తే పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.