Harish Rao: సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వే, ఇజ్జత్ మొత్తం పోయింది - హరీశ్ రావు
Harish Rao Comments: కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్.. సిద్దిపేట నుంచి కొండాపూర్ కు వచ్చారు. అక్కడ కౌశిక్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
Telangana Latest News: హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగిందని.. బీఆర్ఎస్ కార్యకర్తలను గృహ నిర్భందం, అరెస్టులు చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. పైలెట్, ఎస్కార్ట్ ఇచ్చి తమ ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ వాళ్ళను దాడికి పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేటలో తన క్యాంపు కార్యాలయంపైన కూడా దాడి జరిగిందని చెప్పారు. ఇటీవల ఖమ్మంలో వరద బాధితుల పరామర్శకు వెళ్తే కూడా తమపై దాడి చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు.
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అనుచరులు కొండాపూర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన విషయం తెలుసుకున్న హరీశ్ రావు.. సిద్దిపేట నుంచి కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరి వచ్చారు. కౌశిక్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. రేవంత్ వెంటనే కౌశిక్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి అక్రమంగా చేర్చుకోవడంతో పాటు, వారినే తిరిగి ఉసిగొల్పి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలపై దాడులు చేయించడం దుర్మార్గం అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘కాంగ్రెస్ పార్టీలో చేరాను అని ట్విట్టర్లో పెట్టి.. ఇవాళ పీఏసీ చైర్మన్ అవ్వగానే నేను ప్రతిపక్షంలో ఉన్నా అని కూడా సిగ్గులేకుండా మాట్లాడింది నువ్వు అరికెపూడి గాంధీ. డిఫెన్సులో పడి నీ ఇజ్జత్, మానం పోయిందని ఇయాల ప్రశ్నిస్తే మా కౌశిక్ రెడ్డి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు’’ అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేసి పోలీసులు ఏం చేస్తున్నారు? కౌశిక్ రెడ్డిపై దాడి రేవంత్ రెడ్డి చేయించారు. ఏసీపీ, సీఐను వెంటనే సస్పెండ్ చేయాలి. కేసీఆర్ హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు కాపాడారు. పెట్టుబడులు స్వర్గధామంగా హైదరాబాద్ ను కేసీఆర్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అడుపుతప్పాయి. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటుంది. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలు అయింది. ఇది రేవంత్ రెడ్డి వైఫల్యం. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నారు. రాష్ట్రంలో తొమ్మిది కమ్యూనల్ ఘటనలు చోటుచేసుకున్నాయి. తొమ్మిది నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్రతిష్టపాలు అయింది. మా సహనాన్ని చేతగానితనంగా భావించవద్దు.
పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి విషయంలో స్పీకర్ స్పందించాలి. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. మాటల్లో ప్రజా పాలన...రాహుల్ గాంధీ చేతుల్లో రాజ్యాంగం. కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ మందలిస్తారా లేదా చెప్పాలి. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై నమ్మకం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. సైబరాబాద్ సీపీకి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేస్తారు’’ అని హరీశ్ రావు మాట్లాడారు.
హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు
అనంతరం సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటబెట్టుకొని కొండాపూర్ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయలుదేరి వెళ్లారు. తర్వాత సీపీ కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది.