Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం
Gujarat Junior Clerk Exam 2022 Cancelled: తాజాగా గుజరాత్ విద్యా శాఖ ఓ పరీక్షను రద్దు చేసింది. అయితే దాని మూలాలు హైదరాబాద్ లో ఉండటం కలకలం రేపుతోంది.
Gujarat Junior Clerk Paper Leak: ఇదివరకే ఎన్నో సందర్భాలలో పరీక్షలను, పరీక్షల ఫలితాలను పేపర్ల లీకేజీ కారణంగా రద్దు చేయడం చూస్తున్నాం. తాజాగా గుజరాత్ విద్యా శాఖ జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ ను రద్దు చేసింది. అయితే దాని మూలాలు హైదరాబాద్ లో ఉండటం కలకలం రేపుతోంది. గుజరాత్ లో నిర్వహించిన పంచాయతీ రాజ్ ఎగ్జామ్ పేపర్ హైదరాబాద్ నుంచే లీకైనట్లు సమాచారం. పేపర్ లీకేజీకి సంబంధించి గుజరాత్ పోలీసులు హైదరాబాద్ లో తనిఖీలు చేపట్టారు. నగరంలోని ఐడీఏ బొల్లారంలోని ఓ కేఎల్ ప్రింటింగ్ ప్రెస్ లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రింటింగ్ ప్రెస్ ఆపరేటర్ సర్దాకర్ రోహను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాకు చెందిన జితూ నాయక్ ద్వారా పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఎగ్జామ్ కు రెండు గంటల ముందు పంచాయతీ రాజ్ పేపర్ లీకైనట్లు అధికారులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
జూనియర్ క్లర్క్ పరీక్ష రద్దు
గాంధీనగర్: పేపర్ లీక్ అయిన కారణంగా జూనియర్ క్లర్క్ పరీక్షలను రద్దు చేసినట్లు గుజరాత్ పంచాయతీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (GPSSB) సెక్రటరీ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ జూనియర్ క్లర్క్ రాత పరీక్ష పేపర్ లీక్ అయినట్లు ఆదివారం ఉదయం పోలీసులు GPSSBకి సమాచారం అందించడంతో ఎగ్జామ్ రద్దు చేసినట్లు సెక్రటరీ తెలిపారు. ఎగ్జామ్ పేపర్ లీకేజీకి సంబంధించి, పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఔత్సాహిక అభ్యర్థులందరూ పరీక్షా కేంద్రాలకు చేరుకోవద్దని బోర్డు విజ్ఞప్తి చేసింది. ఎగ్జామ్ నిర్వహణ తేదీని త్వరలో ప్రకటిస్తామని అన్నారు.
విద్యార్థి నేత యువరాజ్‌సింగ్ జడేజా గుజరాత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత అనుభవాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. 1,150 జూనియర్ క్లర్క్ పోస్టుల కోసం తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, కానీ పరీక్ష నిర్వహణకు ముందే ఎగ్జామ్ రద్దు చేసినట్లు ప్రకటించారని జడేజా తెలిపారు. గతంలో పలు కాంపిటీటివ్ పరీక్షల పేపర్ లీక్ స్కామ్‌ను బహిర్గతం చేసిన వ్యక్తిగానూ జడేజా గుజరాత్ లో అందరికీ సుపరిచితుడే.