Gruha Lakshmi Scheme: ఆగస్టు నుంచి పట్టాలెక్కబోతున్న గృహలక్ష్మీ పథకం, ఏటా 4 లక్షల మందికి సాయం
Gruha Lakshmi Scheme: ఆగస్టు నుంచి రాష్ట్రంలో గృహలక్ష్మీ పథకం ప్రారంభం కాబోతుంది. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోవాలనే ప్రజల్లో దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఏటా 4 లక్షల మందికి సాయం చేయనుంది.
Gruha Lakshmi Scheme: ఆగస్టు నెల నుంచి రాష్ట్రంలో గృహలక్ష్మీ పథకం ప్రారంభం కాబోతుంది. సొంతస్థలం ఉండి, ఇంటిని నిర్మించుకునేందుకు ఆసక్తి ఉన్న వాళ్లకు మంచి రోజులు వచ్చాయి. గృహలక్ష్మి పేరిట తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన నూతన పథకం వచ్చే నెల(ఆగస్టు) నుంచే మొదలు కాబోతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయబోతుంది. గృహలక్ష్మీ పథకం అమలుకు సంబంధించిన కార్యాచారణ విధానాల గురించి కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఆ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏటా 4 లక్షల మందిని ఎంపిక చేసి సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకనేందుకు ముందుకు వచ్చే వారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజక వర్గం నుంచి 3 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఎంపిక అయిన లబ్ధిదారులకు 3 దశల్లో వారికి వచ్చే నిధులను విడుదల చేయాలని అనుకుంటోంది.
ఎస్సీలకు 20, ఎస్టీలకు 10, బీసీ మైనార్టీలకు 50 శాతం ప్రాధాన్యం
గృహలక్ష్మీ పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ విధానాలను రూపొందించాలని తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు సిద్ధమయ్యారు. పనులను కూడా ప్రారంభించారు. ఏ సర్కారు పథకంలో అయినా లబ్ధి పొందని వారికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ మైనార్టీలకు 50 శాతం ఇవ్వాలని ప్రభుత్వం చెప్పింది. మిగిలిన 20 శాతాన్ని ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇవ్వనుంది. కార్యాచరణ విధానాల రూపకల్పనలో మున్సిపల్, పంచాయతీ రాజ్, రహదారులు - భవనాల శాఖ ఉన్నతాధికారులను భాగస్వాములను చేయనుంది. ఈ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అనుకుంటున్నారు.
ఆగస్టు చివరి వారం నుంచే దరఖాస్తులకు ఆహ్వానం
వచ్చే నెల చివరి వారం నుంచి లబ్ధిదారుల దరఖాస్తులను ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు మంత్రి స్థాయిలో చర్చలు జరిపి.. ముసాయిదా విధానాలను సీఎం కేసీఆర్ కు ఉన్నతాధికారులకు అందజేస్తారు. ఆయన సూచనల మేరకు మార్పులు చేశాక తుది ఉత్తర్వులు వెలువడుతాయని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 3 వేలమ మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేయనున్నందున.. మిగిలిన దరఖాస్తుదారులకు ప్రాధాన్య కమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు చేసుకునేందుకు తుది గడువును కూడా ముఖ్యమంత్రిలో భేటీ అయ్యాక ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.