TSRTC Bill : గవర్నర్ వద్దే ఆర్టీసీ బిల్లు - సమయం కావాలన్న తమిళిసై ! చలో రాజ్ భవన్‌కు ఆర్టీసీ ఉద్యోగుల పిలుపు
ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడంపై వివాదం ఏర్పడింది. శనివారం ఆర్టీసీ ఉద్యోగులు చలో రాజ్ భవన్ నిర్వహించాలని నిర్ణయించారు.
TSRTC Bill : అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. మనీ బిల్ కావడంతో.. గవర్నర్ ఆమోదానికి పంపించింది సర్కార్. బిల్ కు గవర్నర్ ఆమోదం తెలపలేదు. గవర్నర్ ఆమోదం కోసం తెలంగాణ అసెంబ్లీ ఎదురుచూస్తోంది. న్యాయసలహా తీసుకొని సమస్యలు రాకుండా చూసుకునేందుకు ఆర్టీసీ విలీనం బిల్లు అనుమతికి సమయం కావాలన్నారు గవర్నర్ తమిళిసై. కావాలనే గవర్నర్ ఈ బిల్లుపై స్పందించలేదన్న విమర్శలపై ఆమె స్పందించారు. తనకు బిల్లు మొన్న మధ్యాహ్నం అందిందని.. కొంత సమయం అవసరమని ామె స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలను రేపటితో ముగించాలని సర్కార్ చూస్తోంది.
ఆర్టీసీ విలీన బిల్ ను ఇవాళ కానీ రేపు గానీ వస్తే.. ఆదివారం రోజు కూడా సభ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వేళ గవర్నర్ రేపటి వరకు ఆమోదించకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందనే ఆసక్తిగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆసంస్థలో పనిచేస్తున్న 43 373 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.టీఎస్ఆర్టీసీ బిల్లు వ్యవహారం గవర్నర్, గవర్నమెంట్ మధ్య మరోసారి వివాదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న టైంలో కొన్నింటికి గవర్నర్ నుంచి ఆమోదం లభించకపోవడంతో వివాదానికి కారణవుతోంది. టెక్నికల్‌గా ఇది ఆర్థిక బిల్లు అయినందున ముందు గవర్నర్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
అందుకే ఇప్పుడు ఈ బిల్లు అనుమతి కోసం గవర్నర్ తమిళిసై వద్దకు పంపించి ప్రభుత్వం. ఈ సమావేశాల్లో కచ్చితంగా ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. శాసన సభ వర్షాకాల సమావేశాలను మూడు రోజుల్లో ముగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికే రెండు రోజులు సమావేశాలు పూర్తయ్యాయి. ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇంత వరకు గవర్నర్ నుంచి ఆర్టీసీ విలీనం బిల్లుపై ఎలాంటి కదలిక లేదు. దీనిపై బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. చాలా మంది పేదలకు న్యాయం చేద్దామని చూస్తుంటే రాజ్‌భవన్ నుంచి సానుకూల స్పందన రాలేదంటున్నారు. మొదటి నుంచి గవర్నర్ ఇదే తీరున వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.
బిల్లును ఆమోదించాలా లేదా అన్నది గవర్నర్ ఇష్టం. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సమయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ అభ్యంతరం చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. ఇలాంటి సమయంలో.. బిల్లు విషయంలో న్యాయపరమైన సలహా తీసుకోవడానికి తమిళిసై ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రక్రియ వారం రోజులపైగా సాగితే.. ప్రభుత్వ ప్రయత్నాలకు ఇబ్బంది ఎదురయినట్లే అనుకోవచ్చు.
మరో వైపు గవర్నర్ బిల్లును పెండింగ్‌లో పెట్టడంపై ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు. శనివారం "చలో రాజ్ భవన్" కార్యక్రమం చేపట్టాలని ఆర్టీసీ ఉద్యోగులు నిర్ణయించారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లుకు ఆమోదం తెలుపని తెలంగాణ గవర్నర్ తమిళిసై.. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు రేపు శనివారం చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.