Hyderabad Road Digging: హైదరాబాద్ లో రోడ్ల తవ్వకాలపై జీహెచ్ఎంసీ నిషేధం, త్వరలోనే అమల్లోకి!
Hyderabad Road Digging: భాగ్యనగరంలోని రోడ్ల మధ్యలో కటింగ్, తవ్వకాలు చేయకూడదని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. త్వరలోనే వీటిని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
Hyderabad Road Digging: జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భాగ్య నగరంలో రోడ్ల మధ్యలో కటింగ్, తవ్వకాలు చేపట్టకూడదని నిషేధించారు. రానున్న వర్షా కాలాన్ని దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షా కాలం ముగిసే వరకు అంటే అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని వెల్లడించారు. అత్యవసరంగా రోడ్లు తవ్వాల్సి వస్తే మాత్రం కచ్చితంగా జీహెచ్ంసీ కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అనుమతి పొందిన తర్వాతే తవ్వకాలు చేపట్టాలని.. కానీ వాటి వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనుమతి తీసుకున్న వారిదేనని వివరించారు.
అనుమతులు పొందకుండా తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరే బాధ్య వహించాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ కమీషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతే కాదండోయ్ నిబంధనలు ఉల్లంఘించిన శాఖలు, ఏజెన్సీలు భవిష్యత్తులో రోడ్డు కట్టింగ్ కు దరఖాస్తు చేసుకుంటే విచారణ చేపడతామని అన్నారు.
మే 31వ తేదీలోగా ఈసీని పునరుద్ధరించాలి..!
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ మరికొన్ని ప్రభుత్వ శాఖలు... హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రోడ్లను తవ్వుతున్నారు. అయితే ఆ రోడ్ల కట్టింగ్ నిలిపి వేసి తాక్కాలికంగా ఈసీని పునరుద్ధరించాలని జీహెచ్ఎంసీ సూచంచింది. ఈ ప్రక్రియను మే 31వ తేదీలోగా పూర్తి చేయాలని ఎగ్జిక్యూటవ్ ఇంజినీర్లను ఆదేశించారు. వాహనదారులకు అసౌకర్యం కల్గకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలంలో రోడ్లను తవ్వడం వల్ల వర్షా కాలంలో నీరు నిలిచిపోతుంది. కొందరు ప్రమాదవశాత్తు గుంతల్లో పడే ప్రమాదం కూడా ఉంది. అలాగే వర్షా కాలంలో రోడ్లపై తవ్వడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డు కట్టింగ్, తవ్వకాలపై జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది.
తాజాగా నగరంలో సెల్లార్ల తవ్వకాలపై జీహెచ్ఎంసీ నిషేధం విధించింది. వర్షాకాలం పూర్తయ్యే వరకు కత్తగా నిర్మించే భవనాల్లో సెల్లార్ల కోసం తవ్వకాలు చేపట్టవద్దని సూచించారు. అలాగే సెల్లార్లు నిర్మించని వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనుమతులు పొంది తర్వాత సెల్లార్లు నిర్మిస్తున్న చోట తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలంలో సెల్లార్ లోకి నీరు భారీగా చేరుతుంది. దీంతో చాలా మంది సెల్లార్లలో చిక్కుకుపోతున్నారు. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ చరుగ్గా అడుగులు వేస్తోంది.