Meat Shops Close: మాంస ప్రియులకు బ్యాడ్ న్యూస్! ఈ సండే చికెన్, మటన్ షాపులు బంద్
Hyderabad News: 21న హైదరాబాద్‌లోని కబేళాలతో పాటు మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించినట్లు జీహెచ్ఎంసీ రొనాల్డ్ రాస్ తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి యథాతథంగా షాపులు తెరుచుకోనున్నాయి.
Mahavir Jayanti: ఏప్రిల్ 21 వచ్చే ఆదివారం రోజున హైదరాబాద్ లో మాంసం దుకాణాలు అన్నీ మూసి ఉండనున్నాయి. అన్ని చికెన్, మటన్ షాపులను ఆ రోజు మూసేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అసలే ఆదివారం చికెన్, మటన్ షాపుల ముందు రద్దీ విపరీతంగా ఉంటుంది. దీంతో సరిగ్గా ఆదివారం ఆ షాపులను మూసేస్తుండడంతో మాంసం ప్రియులు కాస్త నిరాశే. ఈ నెల 21న హైదరాబాద్ లోని అన్ని రకాల గొర్రెలు, మేకలు, పశువుల కబేళాలతో పాటు మాంసం దుకాణాలు మూసేయాలని.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. వీటితో పాటు రిటైల్ మాంసం, పోర్క్, గొడ్డు మాంసం దుకాణాలు బంద్ చేయాలని నిర్దేశించారు. మహవీర్ జయంతి సందర్భంగా అందరూ ఈ ఆదేశాలను విధిగా పాటించాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
జైనులు జరుపుకునే పండుగలలో మహావీర్ జయంతి చాలా ముఖ్యమైనది. అహింసను ప్రబోధించిన జైన మత ప్రచారకుడు, వర్ధమాన మహావీరుడి జయంతిని ప్రతిసంవత్సరము చైత్ర మాసంలో ఘనంగా జరుపుకుంటారు. 36వ ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు.. 12 ఏళ్ళ పాటు తపస్సు చేసి మహావీరుడుగా జైనమత ప్రచారకుడయ్యారు. అప్పటికే జైన మతానికి 23 మంది తీర్ధంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఆ మతానికి సంబంధించిన వివరాలు వెలుగు చూసినట్లుగా చెబుతారు. 32 ఏళ్ళ పాటు అహింసా ధర్మంతో మత ప్రచారం జరిపిన మహావీరుడు 72వ ఏట మరణించారు.
ఆయన జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని కబేళాలతో పాటు మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించినట్లు జీహెచ్ఎంసీ రొనాల్డ్ రాస్ తెలిపారు. హైదరాబాద్ సిటీలో మాంసానికి ఉన్న డిమాండ్ మరే నగరంలోనూ ఉండని సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో ఉన్న జనాభాతో పాటు వేలాది సంఖ్యలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు కూడా భారీ మొత్తం మాంసం కొనుగోలు చేస్తుంటాయి. ఆదివారం షాపుల మూసివేత కారణంగా వీరికి కాస్త నష్టం ఎక్కువగా ఉండనుంది. కానీ, ఈ ఉత్తర్వుల గురించి తెలిసిన వారు మాత్రం ముందు రోజే తాజా మాంసాన్ని కొనుగోలు చేసుకొని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకొని ఆదివారాన్ని యథాతథంగా జరుపుకోనున్నారు. తిరిగి సోమవారం యథావిధిగా కబేళాలు తెరుచుకోవచ్చని కమిషనర్ చెప్పారు.