Free Heart Surgeries: హైదరాబాద్‌లో చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు, వారం రోజులపాటు సర్జరీలు ఫ్రీ
Free Heart Surgeries for children In Hyderabad | నిమ్స్ ఆసుపత్రిలో వారం రోజులపాటు చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు చేయనున్నారు. త్వరలో నిమ్స్ హాస్పిటల్‌కు యూకే డాక్టర్ల బృందం రానుంది.
Free Heart Surgeries In NIMS: గుండె సంబంధిత సమస్యలు ఉన్న చిన్నారులకు ఇది ఓ వరం లాంటి వార్త. కొందరు పిల్లలకు పుట్టుకతోనే గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు వస్తాయి. పుట్టిన తరువాత కొన్నేళ్లకు సైతం గుండెలో రంద్రం లాంటి సమస్యల బారిన పడుతుంటారు కొందరు పిల్లలు. ఇలాంటి వారికి హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ శుభవార్త చెప్పింది. వారం రోజుల పాటు గుండె సంబంధిత సమస్యలు ఉన్న పిల్లలకు ఉచితంగా సర్జరీలు చేయనున్నారు.
హైదరాబాద్‌కు యూకేకు చెందిన డాక్టర్స్ టీమ్
ప్రతి ఏడాది వారం రోజుల పాటు నిమ్స్ ఆసుపత్రిలో ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో యూకేకు చెందిన వైద్యుల బృందం వచ్చేవారం హైదరాబాద్ రానుంది. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 28వ తేదీవరకు నిమ్స్ హాస్పిటల్‌లో పిల్లలకు గుండెకు సంబంధించిన సర్జరీలు ఉచితంగా చేయనున్నారు. రమణ దన్నపునేని ఆధ్వర్యంలో యూకే డాక్టర్స్ టీమ్ ఈ ఉచిత వైద్య సేవల్ని అందించనుంది. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో నిమ్స్ హాస్పిటల్‌లో వారం రోజులపాటు చిన్నారుల గుండె సమస్యలకు ఉచిత చికిత్స చేయనున్నారు.
ఆర్థిక స్థోమత లేని కారణంగా పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించలేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిమ్స్ సంచాలకులు ప్రొఫెసర్ నగరి బీరప్ప సూచించారు. యూకే నుంచి వచ్చే డాక్టర్లతో పాటు నిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు సైతం వారం రోజులపాటు పిల్లలకు గుండె సంబంధిత ఈ ఉచిత సర్జరీలు చేయనున్నారు. నిమ్స్ హాస్పిటల్ నుంచి కార్డియోథొరాసిక్ డిపార్ట్‌మెంట్ హెడ్, ప్రొఫెసర్ అమరేశ్వరరావు, సీనియర్ డాక్టర్ గోపాల్, ఇతర సిబ్బందితో కలిసి చిన్నారులకు ఉచిత గుండె సంబంధిత సర్జరీ, చికిత్స అందిస్తారని తెలిపారు.
పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు (CHD) ఉన్న పిల్లలకు చికిత్స చేపించే ఆర్థిక స్థోమత లేక ఆందోళన చెందే తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉచితంగా సర్జరీలు చేపించాలనుకునే వారు 040-23489025, 040-23489000, 040-23396552లో నిమ్స్ ఆసుపత్రి వారిని స్పందించవచ్చు. మంగళ, గురు, శుక్రవారాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య నిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి వివరాలు తెలుసుకుని రిజిస్ట్రర్ చేపించుకునే వీలుంది. గతంలో ఎక్కడైనా చికిత్స చేపించింటే, ఆ డాక్టర్ రిపోర్టులను తీసుకురావాలని గుండె జబ్బులున్న పిల్లల తల్లిదండ్రులకు సూచించారు.