Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- షార్ట్‌సర్క్యూట్ అంటున్న యజమాని
Telangana News: హైదరాబాద్‌లోని ఓ బిస్కెట్ ఫ్యాక్టరీ ఆగ్ని ప్రమాదంలో కాలిబూడిదైంది. ప్రమాదానికి కారణాలు పూర్తిగా తెలియడం లేదు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Hyderabad News: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాటేదాన్(Katedhan)లో ఉన్న రవి బిస్కెట్ ఫ్యాక్టరీ(Ravi Biscuits Factory )లో వేకువ జామున మంటలు అంటుకున్నాయి. ప్రమాదం ఎలా ఎందుకు జరిగిందో కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన జరిగిన క్షణాల్లోనే మంటలు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. చూస్తుండగానే ఫ్యాక్టరీ కాలిబూడిదైపోయింది.
మూడు అంతస్తుల్లో ఉన్న ఫ్యాక్టరీకి మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున పొగ ఆప్రాంతాన్ని కమ్మేసింది. అగ్ని కీలలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతంలో ఉన్న వారంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. ఆ ప్రాంతంలో పొగ వ్యాపించడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
ప్రమాదం విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న అగ్నిమాపక యంత్రాలు క్షణాల్లో అక్కడకు చేరుకున్నాయి. ముందు రెండు ఫైర్ ఇంజిన్లు వెళ్లాయి. మంటలు వ్యాప్తి ఎక్కువ ఉండటంతో మరో మూడింటిని అధికారులు స్పాట్‌కు పంపించారు. మొత్తం ఐదు ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి.
బిస్కెట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంతో ప్రాణ నష్టం లేకపోయినా ఆస్తినష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపై యాజమాన్యం కూడా స్పందించలేదు. ప్రమాదం ఎలా జరిగింది... లోపల సరకు ఎంత ఉంది. మిషనరీ ఏ స్థాయిది అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. యాజమాన్యాం, ఇతర సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగానే..
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అంటున్నారు బిస్కెట్ ఫ్యాక్టరీ యజమాని. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత లెక్కించి పూర్తి వివరాలు చెప్పగలమని అంటున్నారు. "పై అంతస్తులో ప్యాకింగ్ మెటీరియల్ స్టోరీ చేసే ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. షార్ట్ సర్య్కూట్ వల్లే మంటలు అంటుకున్నాయి. ఇందులో వంద మంది పని చేస్తుంటారు. ప్రమాదం జరిగిన వెంటనే వాళ్లంతా సురక్షితంగా బయటకు వచ్చేశారు. ఈ ప్రమాదంతో లక్షల్లో నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నాం. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత చూశాకే పూర్తి వివరాలు చెప్పగలం" అని ఫ్యాక్టరీ యజమాని తెలిపారు.