Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Rajendra Nagar Fire Accident: మంటలను ఆగ్నిమాపక సిబ్బంది ఆర్పడానికి యత్నించారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని గగన్ పహాడ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ థర్మకోల్ ఫ్యాక్టరీలో మంటలు అంటుకొని పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ఆ థర్మకోల్ ఫ్యాక్టరీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయడంతో ఆరు ఫైరింజన్లను రప్పించారు.
మంటలను ఆగ్నిమాపక సిబ్బంది ఆర్పడానికి యత్నించారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మంటలు ఎగసిపడుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రూ.కోటి నుంచి రూ.రెండు కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు థర్మాకోల్ కర్మాగారం నడుపుతున్న యజమాని తెలిపారు. డీఆర్‌ఫ్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.