Crime News: ఎలాంటి పరీక్షలు, ప్రాక్టికల్స్ లేకుండా 3 లక్షలకే బీటెక్ సర్టిఫికెట్
పరీక్షల్లో తప్పినా విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని వారికి నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా ఆగడాలు గుట్టురట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు.
దేశంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీల పేరుతో విచ్చల విడిగా నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నారు. ఒక్కొక్క డిగ్రీ సర్టిఫికెట్లు ఒక్కో రేటు పెట్టి ఫెయిల్ అయినా సరే పాస్ అయినట్లు చూపిస్తున్నారు. ఈ దందాలో యూనివర్సిటీ ఛైర్మన్ దగ్గర నుంచి కంప్యూటర్ ఆపరేటర్ వరకు అంతా భాగం అయ్యారు. విద్యార్థులు తల్లిదండ్రులకు కూడా ఈ వ్యవహారం తెలిసినట్టు విచారణలో తేలింది.
పరీక్షల్లో తప్పినా విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని వారికి నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా ఆగడాలు గుట్టురట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా బీటెక్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ ఇలా ఏ డిగ్రీ అయినా మీకు సర్టిఫికెట్లు కావాలంటే మేము ఇస్తామంటూ టెలీకాలర్లు ద్వారా కాల్ చేస్తున్నాయి ముఠాలు.. దీంతో పాస్ కాలేక పోతున్నామని భావించే విద్యార్థులు అక్రమ మార్గాల్లో సర్టిఫికెట్లు పొందుతున్నారు. హైదరాబాద్‌లో కొన్ని కన్సెల్టెన్సీలు ఏర్పాటు చేసుకొని విద్యార్థుల నుంచి లక్షలు రూపాయాలు దండుకుంటున్నారు..
ఇతర రాష్ట్రలో ఉన్న యూనిర్శిటీలతో చేతులు కలిపి నకిలీ సర్టిఫికెట్లు విద్యార్థులకు అందజేస్తున్నారు. డిగ్రీ ఫెయిల్ అయితే చెప్పండి అడిగినంత డబ్బు ఇస్తే చాలు, ఎలాంటి పరీక్ష రాయకుండా , క్లాస్‌లకు అటెండ్ అవ్వకుండా యూనివర్సిటీ సర్టికేట్లు అందజేస్తామని చెప్పి లక్షలు రూపాయలు దండుకుంటున్నారు. మలక్‌పేట్‌కి చెందిన ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డి.. శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ కన్సల్టెన్సీ పెట్టాడు. కొంత మంది టెలీకాలర్లు నియమించుకొని ఫెయిల్ అయిన విద్యార్థులకు కాల్ చేసి వారిని రప్పిస్తున్నారు. కావాల్సిన డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి, ఒక్కొక్క డిగ్రీ మార్క్స్ మెమోకి ఒక్కో రేటు ఫిక్స్ చేశారు.
బీటెక్ సర్టిఫికెట్లు ఇవ్వాలి అంటే 3 లక్షలు, బీఎస్సీ 1.7లక్షలు, బీకాం 1.50 లక్షలు వసూలు చేస్తున్నట్లు తేలింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డికి మధ్యప్రదేశ్‌కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్ సహాయం చేసినట్టు విచారణలో తేలింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్ ఎస్‌ఆర్‌కే యూనివర్సిటీలో పని చేస్తూ, అక్కడ ఈ విద్యార్థులు పాస్ అయినట్లు ఒరిజినల్ సర్టిఫికెట్లును అక్రమ మార్గంలో విక్రయిస్తున్నారు.
ఇందులో కేవలం కేతన్ సింగ్ ఒక్కరే కాదు.. యూనివర్సిటీ ఛైర్మన్‌కు సంబంధాలు ఉన్నట్లు తేలింది. వారికి వచ్చిన సొమ్ములో వాటాలు అందుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ప్రైడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో కూడా మరో ముఠా ఇలాగే దందా చేస్తున్నట్లు తేలింది. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులును టార్గెట్‌గా చేసుకొని ఒక్కో సర్టిఫికెట్ లక్షల్లో అమ్మకాలు చేస్తున్నారు.. చెంగుంటి మహేశ్వర్ అనే వ్యక్తి కేతన్ సింగ్ తో చేతులు కలిపి డిగ్రీ మార్క్స్ మెమోలు విచ్చల విడిగా అమ్మకాలు చేస్తున్నారు. ఈ యూనివర్సిటీలలో కింది స్థాయి సిబ్బంది నుంచి వైస్ ఛాన్సలర్ వరకు అమ్మకాలు చేస్తున్నట్లు తేలింది.
ఇద్దరు వైస్ ఛాన్సలర్లును అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు పోలీసులు. నిందితులు నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీకి చెందిన 44, ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్లోకల్ యూనివర్సిటీ 4, స్వామి వివేకానంద 24 సర్టిఫికెట్లు సీజ్ చేశారు. మొత్తం 80 సర్టిఫికెట్లుపైగా వివిధ యూనివర్సటీలకు చెందిన మార్క్స్ మెమోలను స్వాధీనం చేసుకున్నారు..
భూపాల్‌లోని SRK యూనివర్సిటీ కి చెందిన వైస్ ఛాన్సలర్ ప్రశాంత్ పిళ్లైతోపాటు ఇప్పటికే రిటైర్ అయినా వైస్ ఛాన్సలర్ కుష్వాహాను ఇద్దర్ని అరెస్ట్ చేశారు పోలీసులు.. వీరు ఇచ్చిన సర్టిఫికెట్లు అన్ని కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లుగా నిర్ధారించారు. కానీ ఎలాంటి అడ్మిషన్ లేకుండా, క్లాస్‌లకు అటెండ్ కాకున్నా ,ఫెయిల్ అయినా విద్యార్థులకు పాస్ అయినట్లు మార్క్స్ మెమో లు లక్షలు రూపయాలు తీసుకొని విక్రయించారని విచారణలో తేలింది. వందల మంది విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకొని దేశం దాటి వెళ్లిపోయారని, చాల మంది విదేశాల్లో కోర్స్‌లు కూడా పూర్తి చేస్తున్నట్లు తేలింది. మద్రాస్ యూనివర్సిటీతోపాటు, మదురై కమరాజు యూనివర్సిటీ ఇలాగే డబ్బులు తీసుకొని డిగ్రీల మార్క్స్ మెమోలు ఇస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ చేస్తున్నారు.
అక్రమ మార్గంలో మార్క్స్ మెమోలు పొందిన తెలంగాణకు చెందిన ఏడుగుర్ని, 19 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సర్టిఫికెట్లు వ్యవహారంలో 12 కేసుల్లో తల్లిదండ్రులు ప్రమేయం ఉండడంతో వారినీ అరెస్ట్ చేశారు పోలీసులు. .. యూనివర్సిటీ ఇన్చార్జ్‌గా, యూనివర్సిటీలలో కీలకంగా ఉండే సునీల్ కపూర్ అనే వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు తేలింది. దీంతో ముందుస్తు బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నాడు. దీంతో సునీల్ కపూర్‌కి 41 CRPC కింద నోటీసులు జారీ చేశారు పోలీసులు.